News

వక్ఫ్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం

266views

కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు వక్ఫ్‌ బిల్లులోని కొన్ని నిబంధనలకు వ్యతిరేకంగా సమాజంలో అశాంతిని సృష్టించేందుకు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఆరోపించారు. అయితే, సవరించిన వక్ఫ్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని వెల్లడించారు. పార్లమెంటు సమావేశమయ్యాక వివిధ పక్షాలతో సంప్రదించి బిల్లును ప్రవేశపెట్టే రోజును, సమయాన్ని ఖరారు చేస్తామన్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే ముస్లింల మసీదులు, సమాధుల స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే దుష్ప్రచారం జరుగుతోందని మీడియా సమావేశంలో మంత్రి పేర్కొన్నారు.

బ్రిటిష్‌ పాలకుల హయాంలో తీసుకువచ్చిన వక్ఫ్‌ చట్టాన్ని క్రమబద్ధీకరించడం కోసమే బిల్లును తెస్తున్నామని వివరించారు. పౌరసత్వ సవరణ చట్టంపైనా ఇలాంటి ఆరోపణలే చేశారని మంత్రి కిరణ్‌ రిజిజు గుర్తు చేశారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఒక్క ముస్లిం పౌరసత్వమైనా రద్దు అయ్యిందా అని మంత్రి ప్రశ్నించారు. ముస్లింల ప్రయోజనం కోసమే బిల్లును తెస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 4వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో వక్ఫ్‌ బిల్లును తొలుత లోక్‌సభలో బుధవారం ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.