News

తిరుమల గొడుగుల ఊరేగింపు

21views

చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్‌ ఆలయంలో తిరుమల గొడుగుల ఊరేగింపును తిరుకంకుడి జీయర్‌ రామానుజ స్వామి బుధవారం ప్రారంభించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నైకి చెందిన హిందూ ధర్మార్ధ సమితి ప్రతి ఏటా శ్రీవారికి గొడుగులు సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సమితి ఆధ్వర్యంలో ఉదయం 10.20 గంటలకు గొగుగులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రారంభోత్సవంలో హిందూ ధర్మార్ధ సమితి ట్రస్టీ ఆర్‌ఆర్‌ గోపాల్‌, నిర్వాహక ధర్మకర్త ఎస్‌.వేదాంతం, విశ్వ హిందూ పరిషత్‌ విద్యా కేంద్రం ప్రధాన కార్యదర్శి గిరిజా శేషాద్రి, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ సోమసుందరం తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఉదయం 11.30 గంటలకు గొడుగుల ఊరేగింపు నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ రోడ్డు, గోవిందప్ప నాయకన్‌ వీధి, భైరాగి మఠం, వాల్టాక్స్‌ రోడ్డు మీదుగా సాయంత్రం 4 గంటలకు అశేష భక్తజనం మధ్య ఎలిఫెంట్‌ గేట్‌ చేరుకుంది. అక్కడి నుంచి చూలై హైరోడ్డు, అవధానం పాపయ్య రోడ్డు, వడమలై వీధి, తానా వీధి, చెల్లప్ప వీధుల మీదుగా రాత్రి అయనావరంలోని కాశి విశ్వనాథ ఆలయం చేరుకుంది. గురువారం విల్లివాక్కం, తిరుముల్లైవాయల్‌, తిరువళ్లూర్‌ మీదుగా సాగే ఊరేగింపు ఈ నెల 7వ తేది తిరుమలకు చేరుకుంటుంది. తిరుమల మాఢ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లే గొడుగులను తిరుపతి జీయర్‌ స్వామి సమక్షంలో టీటీడీ అధికారులకు అప్పగించనున్నట్లు ఆర్‌ఆర్‌ గోపాల్‌ తెలిపారు.