News

ఏబీవీపీ ఆధ్వర్యంలో జనజాతి విద్యార్థుల సమ్మేళనం

19views

ఆధునిక ప్రపంచంలో గిరిజన సంస్కృతి, ఆచారాలు కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డివిజి.శంకరరావు అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో విజయనగరంలోని పీఎస్‌ఆర్‌ స్కూల్‌ ఆవరణలో గత రెండు రోజులుగా నిర్వహించిన జనజాతి విద్యార్థుల సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్‌ డివిజి.శంకరరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామారాజు వంటి అనేకమంది గిరిజనులు వెంట నడిచి ప్రాణాలు సైతం అర్పించారని గుర్తు చేశారు. అడవిని, నీటిని, భూమిని నిత్యం దేవతలుగా కొలుస్తూ, ప్రకృతి మాత బిడ్డలుగా గిరిజనులు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులు జాతీయ భావాలతో, దేశం కోసం ధర్మం కోసం గిరిజన సంస్కృతినీ పరిరక్షిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, క్రీడల్లో ముందుకు వెళ్లాలని కోరారు. అనంతరం అంతర్జాతీయ అంధుల క్రికెటర్‌ రవళి, జాతీయ స్థాయి రన్నింగ్‌ పోటీలో బంగారు పతకం సాధించిన సింహచలంలను సన్మానించి, అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు విద్యారంగ సమస్యలపైన తీర్మానం చేసి అమోదించారు. కార్యక్రమంలో ఏబీవీపీ అఖిల భారత సహా సంఘటన కార్యదర్శి గోవింద్‌ నాయక్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తారకేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి జయచంద్ర, జాతీయ కార్యవర్గ సభ్యుడు అంగనైని ఆనంద్‌, విభాగ్‌ కన్వీనర్‌ బొబ్బది సాయికుమార్‌, గిరిజన విద్యార్థుల కన్వీనర్‌ గెమ్మలి కళ్యాణ్‌, జిల్లా కన్వీనర్‌ సంపత్‌, ఏబీవీపీ నాయకులు, వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.