ArticlesNews

పెదనందిపాడు ఉద్యమ సారధి – ‘‘ఆంధ్రా శివాజీ’’

15views

( అక్టోబరు 4 – పర్వతనేని వీరయ్య చౌదరి జయంతి )

శాంతియుతంగా ఉన్న బహిరంగ విప్లవం…దీనిని శాసనోల్లంఘన ఉద్యమం లేక సహాయ నిరాకరణోద్యమం అనేకంటే విప్లవం అనడం సమంజసం…భారతదేశాన బ్రిటీషు సామ్రాజ్యపు పునాదులనే కదిలించివేసిన ఉద్యమం ఇది..నాటి బ్రిటిష్ అధికారులు మన ఆంధ్రలో జరిగిన ఉద్యమం గురించి అన్నమాటలివి..ఆ ఉద్యమమే ‘‘పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం’’. ఈ ఉద్యమానికి సారథ్యం వహించింది మరెవరో కాదు మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పర్వతనేని వీరయ్య చౌదరి. ప్రజలు ఈయన్ను ‘‘ఆంధ్ర శివాజీ’’, ‘‘దక్షిణ బర్దోలి నాయకుడు’’ అని కీర్తించారు.

గాంధీజీ బర్దోలీలో ఆరంభించాలనుకున్న ఉద్యమం కంటే ముందే..పన్నుల సహాయ నిరాకరణ పెదనందిపాడులో మొదలైంది. వీరయ్య చౌదరి మాటకు విలువిస్తూ పెదనందిపాడు పరధిలోని 18 గ్రామాల్లోని కరణాలు, మునసబులు, గ్రామాధికారులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. బ్రిటిషు సర్కారు రెవెన్యూ సభ్యుడైన హారిస్‌ను రాయబారిగా పంపింది. కానీ ఆ ఎత్తు విఫలం అయింది. దీంతో ఉలిక్కిపడ్డ బ్రిటిషు సర్కారు..ప్రత్యేకంగా అదనపు కలెక్టర్ రూథర్‌ఫర్డ్‌ను దించింది. ప్రజలు చెల్లించింది ఎంత, ఇంకా చెల్లించాల్సింది ఎంత అనే రికార్డులు అందుబాటులో లేవు. అంతా అయోమయం. రూథర్‌ఫర్డ్ రిజర్వు పోలీసులను, బ్రిటిష్ సైన్యాన్ని రప్పించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ, ప్రజలు ఎవరూ సహనం కోల్పోలేదు. ఆంగ్లేయ సైన్యం ఇళ్లల్లోకి చొరబడి అందుబాటులో ఉన్న ధాన్యాన్ని స్వాధీనం చేసుకుంది. భూములను వేలం వేస్తామని అధికారులు బెదిరించారు. అయినా ఎవరు అదిరించి లేదు బెదిరించింది. ఉద్యమం మరింత తీవ్రం అయింది. ప్రజల్ని మతాలు, కులాల పరంగా చీల్చేందుకు రూథర్‌ఫర్డ్ కుట్ర చేశాడు. అయినా పెదనందిపాడు ప్రాంత ప్రజలు చలించలేదు.

కులమత భేదాలు లేకుండా పేదధనిక అంతరాలు లేకుండా అంతా ఏకతాటి పై నిలబడ్డారు. అహింసా పద్ధతుల్లో ఆంగ్లేయులను అల్లాడించారు. పన్నుల నిరాకరణలో దేశానికి మార్గదర్శకం అయ్యారు. పెదనందిపాడు ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం అయిందంటే అందుకు పర్వతనేని వీరయ్య చౌదరి గారి ‘‘సంఘటనా కౌశల్యం’’, అలాగే ఆయన నెలకొల్పిన ‘‘శాంతి సైన్యం’’ ఈ రెండూ ప్రధాన కారణాలు. వీరయ్య చౌదరి 1886 అక్టోబరు 4న పెదనందిపాడు గ్రామంలో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో లక్ష్మమ్మ, వెంకయ్య దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య వరకే అభ్యసించినప్పటికీ పర్వతనేని వీరయ్య చౌదరి గారికి మాతృభాష పట్ల అమితమైన అభిమానం ఉండేది. తెలుగులో పరిజ్ఞానం సంపాదించుకుంటూనే లోక జ్ఞానాన్ని సైతం సంతరించుకున్నారు.

భారత స్వాతంత్ర్యోద్యమంలో అపూర్వ ఘట్టమైన పెదనందిపాడు సహాయ నిరాకరణోద్యమానికి 1922 జనవరి 7న నాంది పడింది. జాతీయోద్యమ నాయకులైన కొండా వెంకటప్పయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి నేతలు పెదనందిపాడు ఫిర్కాలో పర్యటించి పన్నుల నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. వీరి మార్గదర్శనంలో ఉద్యమ నిర్వహణకు పర్వతనేని వీరయ్యచౌదరి నాయకత్వం వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో గుర్రంపై తిరుగుతూ తన మధుర గంభీర కంఠ స్వరంతో, ఆసక్తికరమైన పాటలతో పన్నుల వ్యతిరేక ఉద్యమం గురించి ప్రచారం చేశారు. ప్రజలను చైతన్య పరిచి జాతీయోద్యమ భావాలను పెంపొందించారు. శాంతి సైన్యాన్ని ఏర్పాటు చేసి, ప్రజలను శాంతిపథంలో ఉద్యమబాట పట్టించారు. బ్రిటిషర్లను గడగడలాడించారు. అప్పటివరకు పెదనందిపాడు ఫిర్కాలో 14.73 లక్షల రూపాయలు ఉన్న వార్షిక శిస్తు వసూళ్లు 4 లక్షలకు పడిపోయాయంటే పర్వతనేని వీరయ్య చౌదరిగారే అందుకు కారణం. ఆయన మాటే వేదంగా ప్రజలు ఆయన వెంట నడిచారు.

పర్వతనేని వీరయ్య చౌదరి గారి సారధ్యంలో సుమారు 100 గ్రామాల్లో 4 నెలల పాటు ఉధృతంగా ప్రారంభమైన ఉద్యమం గాంధీజీ ఆదేశాలతో ఒక్కసారిగా నీరుగారిపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఆ తర్వాత ప్రజా జీవితంలోకి రాలేదు. వీరు 1970 ఫిబ్రవరి 8న హైదరాబాదులో కాలధర్మం చెందారు. 1992లో పెదనందిపాడులో ఆచార్య రంగా, బెజవాడ గోపాల రెడ్డిల విగ్రహాల సరసన పర్వతనేని వీరయ్య చౌదరి విగ్రహాన్ని నెలకొల్పారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిషు సైన్య దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేస్తూ వీరయ్య చౌదరి సాగించిన పోరు ఆద్యంతం స్ఫూర్తిదాయకం.