ArticlesNews

ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌కు జయశంకర్ ఘాటు హెచ్చరిక

24views

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 79వ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన పాకిస్తాన్‌ను, భారత్‌లో ఉగ్రవాదం వెనుక పాకిస్తాన్ హస్తాన్నీ తీవ్రంగా విమర్శించారు. తన చర్యల ద్వారా మిగతా ప్రపంచానికి దూరమైపోవాలని పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే నిర్ణయించుకుందని ఆరోపించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణతో పోల్చిన నేపథ్యంలో జయశంకర్ విరుచుకుపడిపోయారు.

జయశంకర్ తన ప్రసంగంలో తమ నియంత్రణలో లేని పరిస్థితుల వల్ల సమస్యలు ఎదుర్కొనే దేశాలకూ, తాము ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్న అంశాల వల్ల తలెత్తే సమస్యలను ఎదుర్కొనే దేశాలకూ మధ్య తేడాను స్పష్టంగా విభజించి చెప్పారు. పాకిస్తాన్ పుట్టిన నాటినుండీ అనుసరిస్తున్న విధానాలు, కార్యాచరణలు దీర్ఘకాలంలో ప్రతికూల పర్యవసానాలకు దారితీసాయి, ప్రస్తుత పరిస్థితికి కారణమయ్యాయని జయశంకర్ వివరించారు. కొన్ని నిర్దిష్టమైన నిర్ణయాలు ఒక దేశం మీద ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపగలుగుతాయో వివరించడానికి ఆయన పాకిస్తాన్‌ను ఉదాహరణగా చూపించారు.

పాకిస్తాన్ తమ దేశపు సమాజాన్నీ, పరిపాలననూ మతోన్మాదంతో నింపేసింది. ఆ దేశపు జిడిపిని కేవలం రాడికలైజేషన్‌తోనూ, వారి ప్రధాన ఎగుమతి అయిన ఉగ్రవాదంతో మాత్రమే లెక్కించడం సాధ్యం. దురదృష్టవశాత్తూ వారి చర్యలు ఇతరుల మీద, మరీ ముఖ్యంగా పొరుగు దేశాల మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి అని జయశంకర్ మండిపడ్డారు.

పాకిస్తాన్ తన ప్రస్తుత దుస్థితికి ప్రపంచాన్ని నిందించడం కాదు, తమ చర్యలే దానికి కారణమని గుర్తించాలి అని జయశంకర్ స్పష్టం చేసారు. కర్మసిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ ఆయన, పాకిస్తాన్ సొంత నిర్ణయాలు, ముఖ్యంగా ఉగ్రవాదం-ప్రాదేశిక ఆశల మీద మాత్రమే దృష్టి సారించడమే ఆ దేశపు ప్రస్తుత నిస్తేజ స్థితికి కారణమని వివరించారు. ఇతరుల భూభాగాలను తమవి అని చెప్పుకుంటున్న పాకిస్తాన్ వాదనలను ఎదుర్కొని పూర్వపక్షం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని జయశంకర్ స్పష్టం చేసారు.

పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిథి సభలో చేసిన ప్రసంగానికి ప్రత్యక్ష స్పందనగా జయశంకర్ ఆ వ్యాఖ్యలు చేసారు. షెబాజ్ షరీఫ్ జమ్మూకశ్మీర్‌ పరిస్థితిని పాలస్తీనా పరిస్థితితో పోల్చారు. తద్వారా జమ్మూకశ్మీర్ వివాదాన్ని ప్రజలు తమ సొంత నిర్ణయం తీసుకునే హక్కు కోసం జరుపుతున్న పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ అధికరణం 370ని రద్దు చేస్తూ భారత్ 2019లో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని షెబాజ్ షరీఫ్ ఐరాస వేదికగా డిమాండ్ చేసారు. ఆ ప్రాంతపు స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించాలని కోరారు. కశ్మీర్ ప్రజల స్వీయ నిర్ణయ ఆకాంక్షలను నెరవేర్చడం అవసరమంటూ సలహా ఇచ్చారు. భారతదేశం వాస్తవాధీన రేఖ దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి చొచ్చుకుని వెడతామంటూ భారత్ బెదిరించిందని, పరస్పర వ్యూహాత్మక సంయమనం వహించాలన్న తమ ప్రతిపాదనను తిరస్కరించిందనీ పాక్ ప్రధాని ఆరోపించారు.

షెబాజ్ షరీఫ్ ప్రసంగాన్ని చీల్చి చెండాడుతూ జయశంకర్ భారతదేశపు వైఖరిని స్పష్టంగా ప్రకటించారు. ఉగ్రవాదాన్ని హద్దులు దాటించడంలో పాకిస్తాన్ సుదీర్ఘకాలంగా అనుసరిస్తున్న విధానం ఎప్పటికీ విజయవంతం కాలేదని స్పష్టం చేసారు. అటువంటి చర్యలకు శిక్ష లేకుండా ఎప్పటికీ తప్పించుకోగలమని పాకిస్తాన్ ఆశించవద్దంటూ హెచ్చరించారు. సర్వప్రతినిధి సభ సమావేశాల్లో పాకిస్తాన్ ప్రవర్తనను వికారమైన మాటతీరుగా కొట్టిపడేసారు. పాకిస్తాన్ తమ సరిహద్దులకు అవతల ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వ్యూహం కచ్చితంగా విఫలమవుతుందని హెచ్చరించారు. పాకిస్తాన్ తన చర్యలకు ప్రతిచర్యలు ఉండవని అనుకోవడం సరికాదని, అటువంటి వైఖరికి తప్పకుండా ఫలితం అనుభవించి తీరుతుందనీ స్పష్టం చేసారు.

భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఒకటే అంశం ఉంది, అది పాకిస్తాన్ ఆక్రమించిన భారత భూభాగాన్ని అది ఖాళీ చేయడమే. ఆ పని జరిగి తీరాలి. ఆ దేశం ఉగ్రవాదంతో తనకున్న అనుబంధాన్ని కూడా తెగతెంపులు చేసుకోవాలి అని జయశంకర్ నొక్కి వక్కాణించారు.

బట్టబయలైన పాకిస్తాన్ వంచన ధోరణి:

పాకిస్తాన్ లాంటి దేశం ఏ రూపంలోనైనా హింస గురించి వ్యాఖ్యానించడం దాని కపట వైఖరిని, వంచనా ధోరణినే ప్రతిఫలిస్తుందని జయశంకర్ కుండ బద్దలుగొట్టేసారు. ఉగ్రవాదాన్ని తమ దేశ విధానంగా పాకిస్తాన్ ఎలా వాడుకుంటోందో ప్రపంచం మొత్తానికీ తెలుసని ఆయన చెప్పుకొచ్చారు.

పాకిస్తాన్‌ నిజరూపాన్ని బైటపెట్టి దాని వైఖరిని విమర్శించడంలో జయశంకర్ ధోరణిని భారత దౌత్యవేత్త భవికా మంగళానందన్ ముందుకు తీసుకెళ్ళారు. షెబాజ్ షరీఫ్ ఐరాసలో చేసిన ప్రకటనలను ఆమె బలంగా తిప్పికొట్టారు. భారతదేశం మీద పాకిస్తాన్ ప్రయోగిస్తున్న ఉగ్రవాదాన్ని దారుణమైన వంచనగా అభివర్ణించారు. పార్లమెంటుతో సహా భారత వ్యవస్థల మీద, భారత పౌరుల మీద ఉగ్రవాద దాడులు చేసిన పాకిస్తాన్ రక్తచరిత్రను ఐక్యరాజ్యసమితిలో తూర్పారబట్టారు.

అంతర్జాతీయ సవాళ్ళు, సంస్కరణల కోసం పిలుపు:

పాకిస్తాన్‌ను ఎండగట్టడం మాత్రమే కాకుండా జయశంకర్ తన ఐరాస ప్రసంగంలో వర్తమాన ప్రపంచ విషయాలను ప్రస్తావించారు. గాజా, ఉక్రెయిన్‌లలో జరుగుతున్న ఘర్షణల గురించి మాట్లాడారు. అటువంటి సంక్షోభాల వేళ ఐరాసలో ప్రపంచ దేశాలు సమావేశమయ్యాయనీ, ఆ సవాళ్ళను ఎదుర్కొని పరిష్కరించడానికి సమష్ఠి కార్యాచరణ అవసరమనీ ఆయన చెప్పుకొచ్చారు.

సర్వప్రతినిధిసభ 79వ సమావేశాల ఇతివృత్తమైన ‘‘ఎవరినీ వదిలిపెట్టకూడదు’’ అనే అంశానికి మద్దతు పలుకుతూ జయశంకర్ ప్రస్తుతం ప్రపంచం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని గుర్తు చేసారు. ప్రస్తుత అంతర్జాతీయ పద్ధతుల్లో కొన్ని దేశాలు తాము ఇచ్చేదానికంటె ప్రపంచం నుంచి ఎక్కువ తీసుకుంటూ ఎక్కువ లాభపడుతున్నాయని వ్యాఖ్యానించారు. దానివల్లే ఉగ్రవాదం, హింస పెరుగుతున్నాయని, ఆహారం, ఎరువులు, ఇంధనం కొరత మిగతా దేశాలను పట్టిపీడిస్తున్నాయనీ స్పష్టం చేసారు. అటువంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయానికి రాలేకపోతే ఐక్యరాజ్య సమితి ప్రభావశీలంగా పనిచేయలేదని వాదించారు.

భారతదేశం ఇటీవల సాధించిన విజయాల ప్రస్తావనతో జయశంకర్ తన ఐరాస ప్రసంగాన్ని ముగించారు. చంద్రయాన్-3 విజయవంతం, 5జి టెక్నాలజీలో పురోగతి, కోవిడ్ సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్‌లు ఉచితంగా సరఫరా చేయడం వంటి భారత విజయాలను వివరించారు. ప్రపంచాన్ని సానుకూల మార్పు వైపు నడిపించేందుకు ‘వికసిత భారతం’ దిశగా నడుస్తున్నామని చెప్పారు.

ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ వేదిక మీదనుంచి జయశంకర్ ఉగ్రవాదం, కశ్మీర్ విషయాల్లో భారతదేశపు వైఖరిని స్పష్టం చేసారు. అభివృద్ధి, సృజనాత్మకత, అంతర్జాతీయ సహకారం వంటి విషయాల్లో భారతదేశపు ప్రణాళికలను ప్రపంచానికి వివరించారు