News

బెంగళూరులో పాకిస్తానీ కుటుంబం గుట్టురట్టు

21views

బెంగళూరు నగర శివార్లలో ఆనేకల్‌ వద్దనున్న జిగణిలో అక్రమంగా మకాం వేసిన పాకిస్తాన్‌ పౌరుడు రషీద్‌ అలీ సిద్దికి (48), అతని భార్య ఆయేషా (38), ఆమె తల్లిదండ్రులు హనీఫ్‌ మహమ్మద్‌ (73), రుబీనా (61) అనేవారిని ఆదివారం రాత్రి జిగణి పోలీసులు అరెస్ట్‌ చేశారు. సదరు వ్యక్తి పాకిస్తాన్‌లోని కరాచీ వద్ద లియాకతాబాద్‌ కాగా, వదిలిపెట్టి బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయి ఢాకాలో స్థిరపడ్డాడు. తరువాత లాహోర్‌కు చెందిన భార్య, అత్తమామలతో 2014లో అక్రమంగా ఢిల్లీకి చేరుకుని అక్కడ స్థానిక వ్యక్తి సాయంతో ఆధార్‌ కార్డులు, డ్రైవింగ్‌లైసెన్సు, పాస్‌పోర్టు తయారుచేసుకుని 2018లో జిగణికి చేరుకుని ఇక్కడే నివాసం ఉంటున్నాడు.

నిఘా సంస్థలకు సమాచారం
ఇతడి ఆచూకీ కనిపెట్టిన కేంద్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు జిగణి పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. తెలివిగా వీరందరూ కూడా ఉత్తరాదికి చెందిన హిందూ పేర్లతో చలామణి అయ్యేవారు. రషీద్‌ అనేవ్యక్తి శంకర్‌శర్మగా, అతని భార్య ఆషారాణిగా, ఆమె తల్లిదండ్రులు రాంబాబు శర్మ, రాణి శర్మగా పేర్లు మార్చుకున్నారు. వీరి ఇంట్లో ల్యాప్‌టాప్‌ను పోలీసులు సీజ్‌చేశారు. వీరు పాకిస్తాన్‌ గూఢచారులా, లేక మరేదైనా? అనేది విచారణ చేపట్టారు. వీరి గుట్టు ఎలా బయటపడిందంటే.. ఇటీవల చైన్నె ఎయిర్‌పోర్టులో ఇద్దరు పాకిస్తానీలు నకిలీ పాస్‌పోర్టులో పట్టుబడ్డారు. వారిని విచారించగా రషీద్‌ గురించి ఉప్పందించారు. పాకిస్తాన్‌లో మత పరమైన గొడవల వల్ల తాము దేశం వదిలిపెట్టినట్లు రషీద్‌ చెబుతున్నాడు. 2018 నుంచి బెంగళూరులో ఉంటున్నట్లు చెప్పాడు.

దర్యాప్తు చేస్తున్నాం: హోంమంత్రి
భారత్‌ నకిలీ పాస్‌పోర్టుతో వీరు గత పదేళ్లుగా భారత్‌లో ఉన్నారని, ఏడాదిక్రితం బెంగళూరుకు చేరుకున్నారని, ఎందుకు వచ్చారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్‌ తెలిపారు. జిగణిలో ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నట్లు చెప్పారు. పాక్‌ కుటుంబం గుట్టు బయటపడడంతో పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఆరా తీశారు. జిగణిలో ఇటీవలే గౌతం బోరా అనే అసోం ఉల్ఫా అనుమానిత ఉగ్రవాది పట్టుబడ్డాడు. ఇంతలోనే పాకిస్తాన్‌ వాసి జాడ తెలిసింది. ఇంకా ఇటువంటివారు ఎంతమంది ఉన్నారనేది సస్పెన్స్‌గా మారింది.