News

శ్రీకాకుళం జిల్లాలో ‘గో’వేదన

32views

శ్రీకాకుళం జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోటబొమ్మాళి మండలం నారాయణవలస సంత నుంచి కబేళాలకు ఈ పశువుల తరలింపు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. రోడ్డు మార్గాన తెచ్చిన ఈ పశువులను మందలుగా జలుమూరు మండలం, లింగాలవలస, జోనంకి పంచాయతీ రాణ తోటల్లో ఉంచుతున్నారు. పశువులు కబేళాలకు తరలించే మరి కొంత మంది ఈ బృందంగా తోడై నారాయణ వలస సంతనే అడ్డాగా మార్చుకున్నారు. పశువులు కాపలా కాసే వారికి భోజన, వసతి సదుపాయాలు, అలాగే పశువులకు కావాల్సిన దాణా, గడ్డి, తాగునీరు తదితర ఏర్పాటుకు కూలీలను సైతం పెట్టారు. బలద, సీతంపేట నుంచి రోడ్డు మార్గాన పాతపట్నం మీదుగా సారవకోట మండలం నుంచి జలుమూరు మండలం రాణ, లింగాలవలస గ్రామాల వద్దకు పశువులను తీసుకెళ్లి తోటల్లో ఉంచుతున్నారు. వాహనాలు సిద్ధం చేసుకుని సంత వద్దకు తెచ్చి సాయంత్రం పశువులను ఆ వాహనాల్లోకి ఎక్కించి రాత్రి పూట హైదరాబాద్‌, బెంగళూర్‌, నేపాల్‌ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదే చోట భారీగా పశువుల పాకలు ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా కొ నుగోలు చేసిన పశువులను ఇక్కడకు లారీలు, వ్యాన్ల ద్వారా తరలిచి గురు, శుక్ర శనివారాలతోపాటు ఆదివారాల్లో కబేళాలకు తీసుకెళ్తున్నారు.

లోడింగ్‌ చేసిన వాహనాల్లో ఉన్న పశువులు అరవకుండా మత్తు ఇంజెక్షన్లు సైతం ఇస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన పోలీసు, పశు సంవర్ధక శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి వారం ఇక్కడ రూ.కోట్లలోనే వ్యాపారం జరుగుతోంది. దాదాపు పది వరకు లారీల్లో పశువులను తరలిస్తున్నారు. దీనిపై పశుసంవర్దక శా ఖ జేడీ ఎం. జయరాజ్‌ను వివరణ కోరగా పోలీస్‌, రెవెన్యూ,ఎంపీడీఓల సమన్వయంతో అడ్డుకుంటామన్నారు. జలుమూరు ఎస్‌ఐ బి.అశోక్‌బాబు మాట్లాడుతూ రోడ్డు మార్గాన తరలించే వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమ రవాణాను అడ్డుకుంటామన్నా రు. కోటబొమ్మాళి మండలం ఎంపీడీఓ మాట్లాడుతూ అక్రమ రవాణాపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.