News

మతమార్పిళ్లు రాజ్యాంగ విలువలకు విరుద్ధం : ఉపరాష్ట్రపతి ధన్కర్

22views

జైపూర్ వేదికగా జరుగుతున్న హిందూ ఆధ్యాత్మిక మరియు సేవామేళా కేంద్రంగా మత మార్పిడులపై భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతి, సూత్రాలు, కలుపుగోలుతనం, ఇతరులకు సేవ చేయడం, జాతీయ ఐక్యత ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా సంస్కృత శ్లోకాలను ఉటంకించారు. ‘‘నేను స్వర్గం లేదా విముక్తి కావడం కోసం ఆరాటపడను. బాధలో వున్న వారి బాధను తగ్గించడానికి నా జీవితం అంకితం చేయాలని అనుకుంటున్నాను’’ అనే భావం వచ్చే శ్లోకాన్ని ఈ సందర్భంగా ఉటంకించారు. విదేశీ దండయాత్రలు జరిగినా, విదేశీయులు ఇంత దోచుకెళ్లినా… మన భారతీయ ధర్మంలో మాత్రం సేవాగుణం ఏమాత్రం తగ్గలేదన్నారు. ఇలా సేవ చేయడం అనేది మన ధర్మంలోనే నిబిడీకృతమై వుందన్నారు. కోవిడ్ సమయంలో హిందూ సమాజం చేసిన సేవ అద్భుతమంటూ కొన్ని ఉదాహరణలను జోడించారు. ఈ కార్యక్రమాలు సమాజంలో వున్న సేవా గుణాన్ని గుర్తు చేస్తుందన్నారు.

అలాగే భారత రాజ్యాంగ పీఠిక సనాతన ధర్మ సారాన్ని ప్రతిబింబిస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. హిందూ తత్వశాస్త్రాల్లో పొందుపరిచిన సమగ్రత మరియు ఇతర లక్షణాలు, ఇతర జీవుల్లో ఆత్మను దర్శించడం అనేది మానవత్వానికి మించిన ధర్మమని వివరించారు. లోతుగా పరిశీలిస్తే హిందూ మతంలో సమగ్రత వుంటుందని, మానవత్వమే కాకుండా అన్ని జీవరాశులు, ప్రకృతి రక్షణను కూడా ధర్మం నొక్కి చెప్పిందన్నారు.
ప్రస్తుతం వాతావరణ మార్పులు అనేవి పెద్ద సవాల్ అని, ఈ సమస్యను పరిష్కరించడంలో సనాతన ధర్మం ఎంతో ఉపకరిస్తుందన్నారు. ప్రపంచం మొత్తం సనాతన తత్వ సూత్రాలకు కట్టుబడి వుంటే మాత్రం వాతావరణ మార్పుల వచ్చే అస్తిత్వ ముప్పును కచ్చితంగా కట్టడి చేయవచ్చని నొక్కి చెప్పారు.

భారతీయంలో వున్న ప్రాచీన జ్ఞానంలో నిక్షిప్తమైన విషయాలను సనాతనులు అభ్యాసం చేస్తున్నారని, ఈ అభ్యాసాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా గుర్తించి, వారు కూడా అభ్యాసం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.దేశంలో మత మార్పిళ్లు పక్కా సంస్థాగతంగానే జరుగుతున్నాయని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, గిరిజనుల్ని టార్గెట్ గా చేసుకుంటూ అలాగే బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకొనే మత మార్పిళ్లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేయడం భారత రాజ్యాంగ సూత్రాలకు, విలువలకు విరుద్ధమని, ఓ ప్రణాళికా బద్ధంగా మత మార్పిళ్లు జరుగుతున్నాయన్నారు. అలాగే భారత దేశాన్ని ఛిన్నాభిన్నం చేయానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, మత మార్పిళ్లు జాతీయ ఐక్యతకు భంగం కలిగిస్తాయని జగదీప్ ధన్కర్ అన్నారు.