News

పూరీ ఆలయంలో ప్రసాదాల నాణ్యత పరిశీలనకు ప్రత్యేక ఫుడ్ ఇనస్పెక్టర్

15views

తిరుమల లడ్డూ వ్యవహారం దేశమంతటా ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే డెయిరీల నుంచే తమ రాష్ట్రాలలోని ప్రముఖ్ దేవాలయాలకు సరఫరా చేయాలని ఆదేశించాయి. ఆ క్రమంలో ఒడిషా పూరీలోని జగన్నాథస్వామి ఆలయంలో ప్రసాదాలు, దీపాలకు వాడే నెయ్యి నాణ్యత పరిశీలనకు ప్రత్యేకంగా ఫుడ్ ఇనస్పెక్టర్‌ను నియమించాలని ఆ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.

ఒడిషా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ మీడియాతో మాట్లాడుతూ, పూరీ జగన్నాథస్వామి ఆలయంలో ప్రసాదాలు, వాటి తయారీలో వాడే పదార్ధాలు, ఇతర పదార్ధాల నాణ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి పూర్తిస్థాయిలో ఒక ఫుడ్ ఇనస్పెక్టర్‌ను నియమించాలని తమ విభాగానికి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. ‘‘ప్రసాదాలు తయారు చేయడానికి, దీపాలు వెలిగించడానికి స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నాం. దేవాలయంలో అత్యుత్తమ నాణ్యత కలిగిన పదార్ధాలను వాడాలన్నదే మా లక్ష్యం. మా విభాగం ఆ మేరకు తీవ్రంగా పరిశీలిస్తోంది’’ అని మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ చెప్పారు.

శ్రీ జగన్నాథ ఆలయ నిర్వాహక వ్యవస్థ దేవాలయంలో వినియోగించే నెయ్యి, ఇతర ఆహార పదార్ధాలకు సంబంధించి నిర్దేశకాలు జారీ చేస్తుంది. అలాగే ఆలయ సేవకుల్లో అవగాహన కల్పించడానికి కూడా ఆలయ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

శ్రీమందిరంలో తయారుచేసే వివిధ పదార్ధాలకు కావలసిన నెయ్యి నాణ్యతను తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ శంకర్ స్వయిన్ సెప్టెంబర్ 24న వెల్లడించారు. ‘‘శ్రీమందిరంలో తయారుచేసే కోఠా భోగ, బారాతీ భోగలో వాడే నేతి నాణ్యత విషయంలో ఎలాంటి ఆరోపణలూ లేవు. కానీ కల్తీ జరిగే అవకాశాలు ఉన్నందున శ్రీమందిరానికి నెయ్యి సరఫరా చేసే ఆమ్‌ఫెడ్‌తో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నాము. ఆలయానికి కంపెనీలు సరఫరా చేసే నెయ్యి తప్పనిసరిగా నిర్ణీత ప్రమాణాలకు లోబడి ఉండాలని ఆదేశించాము’’ అని చెప్పారు.