News

బొట్టు పెట్టుకున్నందుకు ఐదో తరగతి విద్యార్ధిని కొట్టిన క్రైస్తవ అధ్యాపకుడు

4views

బిహార్‌లోని బక్సర్ జిల్లాలో ఐదో తరగతి విద్యార్ధిని ఉపాధ్యాయుడు చితకబాదిన సంఘటన వెలుగు చూసింది. కారణం, ఆ పిల్లవాడు నుదుట బొట్టు పెట్టుకుని, చేతికి రక్షాబంధనం కట్టుకోవడమే. ఆ సంఘటన బుధవారం సెప్టెంబర్ 25న జరిగింది. తనకు జరిగిన దారుణం గురించి ఆ పిల్లవాడు పెట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

బాధిత బాలుడు చురామన్‌పూర్ పట్టణంలోని కార్మెల్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్నాడు. ఆ క్రైస్తవ పాఠశాలలో విన్సెంట్ అనే అధ్యాపకుడు సంస్కృతం బోధిస్తాడు. బుధవారం తరగతి గదిలో పుస్తకాలు సర్దుకుంటూ ఉండగా విన్సెంట్ మాస్టర్ తనను తరగతి గదిలోనుంచి బైటకు లాక్కువెళ్ళి దారుణంగా చితగ్గొట్టాడని ఆ పిల్లవాడు చెప్పాడు.

ఆ టీచర్ తనను నుదుట బొట్టు, చేతికి రక్షాబంధనం, తల మీద శిఖ తీసేయాలని కొద్దిరోజులుగా హెచ్చరిస్తున్నాడని బాధిత బాలుడు చెప్పాడు. తన తల్లిదండ్రులను విన్సెంట్ మాస్టర్ దారుణంగా తిట్టాడని, తనకు సరైన విలువలు నేర్పలేదంటూ దూషించాడనీ ఆవేదన వ్యక్తం చేసాడు.

ఆ సంఘటనతో బాలుడి తల్లిదండ్రులు ఆ విన్సెంట్ అనే టీచర్ మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాడు చేసారు. అధికారులు ఆ వ్యవహారంలో దర్యాప్తు ప్రారంభించారు. అయితే పాఠశాల యాజమాన్యం మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపడేసింది. తమ పాఠశాలను అప్రతిష్ఠపాలు చేయడానికి పన్నిన కుట్రగా వ్యాఖ్యానించింది.