News

శతకోటి సూర్యులను తలదన్నే… ప్లాస్మా ప్రవాహాలు

29views

ఇదేమిటో తెలుసా? మన ఊహకు కూడా అందనంత పెద్దదైన బ్లాక్‌హోల్‌ నుంచి దూసుకొస్తున్న రెండు భారీ ప్లాస్మా ప్రవాహాల్లో (బ్లాక్‌హోల్‌ జెట్‌) ఒకటి. ఇప్పటిదాకా గుర్తించిన వాటిలో అత్యంత పెద్దవి ఇవేనట. ఈ ప్రవాహాలు అంతరిక్షంలో ఏకంగా 2.3 కోట్ల కాంతి సంవత్సరాల పొడవున పరుచుకున్నట్టు గుర్తించారు! అంతేగాక ఇవి లక్షలాది కోట్ల సూర్యులను మించిన శక్తిని వెదజల్లుతున్నాయట! దీన్నిబట్టి వాటి ఉద్గమ స్థానమైన రాకాసి కృష్ణబిలం ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు.

ఈ కృష్ణబిలం భూమికి 750 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అనంతశక్తితో నిండిన కృష్ణబిలాలు తన పరిధిలోకి వచ్చే ఏ వస్తువునైనా లోనికి లాక్కుంటాయన్నది తెలిసిందే. ఎంతటి భారీ నక్షత్రాలైనా వాటి బారినుంచి తప్పించుకోలేవు. వాటిని కబళించే క్రమంలో కొద్దిపాటి ద్రవ్యరాశి ప్లాస్మా ప్రవాహంగా మారి కృష్ణబిలం తాలూకు రెండు అంచుల గుండా అపరిమితమైన వేగంతో బయటికి ఎగజిమ్ముతుంది.

వాటిని బ్లాక్‌హోల్‌ జెట్స్‌గా పిలుస్తారు. ఇవి అనంతమైన ప్రకాశంతో మెరిసిపోవడమే గాక దాదాపుగా కాంతివేగంతో దూసుకెళ్తాయి. ఆ క్రమంలో అంతరిక్షంలో ఇలా కళ్లు చెదిరే దృశ్యాలను ఆవిష్కరిస్తాయి. విశ్వనిర్మాణాన్ని బ్లాక్‌హోల్‌ జెట్స్‌ ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి ఈ జంట ప్రవాహాలు ఎంతగానో దోహదపడతాయని సైంటిస్టులు మురిసిపోతున్నారు. వీటికి ముద్దుగా గ్రీకు పురాణాల్లోని మహాకాయుడు పోరి్ఫరియాన్‌ పేరు పెట్టుకున్నారు.