News

ఈనెల 27 నుంచి… రామతీర్థంలో పవిత్రోత్సవాలు

58views

విజయనగరం జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి దేవస్థానం మహా ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 27 నుంచి స్వామివారి సన్నిధిలో పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేద రుత్వికులచే వైఖాసన ఆగమశాస్త్రం ప్రకారం నాలుగు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. 27న సాయంత్రం 6గంటలకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అంకురారోపణం తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించనున్నారు. 28న వేద పండితులచే అగ్ని ప్రతిష్టాపన, శ్రీమద్రామాయణ, సుందరాకాండ పారాయణాలు, దివ్య ప్రబంధ సేవాకాలములు, శ్రీరామ, శ్రీలక్ష్మి మూలమంత్ర జపములు, యాగశాలలో అష్టకలశ హోమాలు, పవిత్ర శుద్ధి, తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి. 29న అష్టకలశ స్నపన మహోత్సవాన్ని జరిపించి ప్రధాన ఘట్టమైన పవిత్రాలను స్వామివారికి సమర్పించనున్నారు. 30న పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, శాంతి కల్యాణం, పట్టాభిషేకమహోత్సవాలను జరిపించి పవిత్రోత్సవాలకు ముగింపు పలకనున్నారు.

వచ్చేనెల 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
అక్టోబర్‌ 3 నుంచి రామతీర్థంలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 3న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురారోపణ జరిపించనున్నారు. 4న సాయంత్రం ధ్వజారోహ ణం నిర్వహించి శ్రీవారి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ వేద మంత్రోచ్ఛారణ నడుమ సమస్తదేవతా మూర్తులకు అర్చకులు ఆహ్వానం పలుకుతారు. 9న ప్రత్యేక పూజల నడు మ శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపిస్తారు. 12న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణం, తదితర కార్యక్రమాలు జరగున్నవి. 13న స్వామికి పుష్పయాగం నిర్వహించి బ్రహ్మోత్సవాలను పూర్తి చేయనున్నారు.