ArticlesNews

సంజయ రాయబారం: తిక్కన చమత్కారం

23views

రాజకీయాలలో రాయబారాలకు గల స్థానము ఈనాడే కాదు, ఏనాటి నుంచో ప్రముఖమైనది. ఇరుపక్షాల వారికి అభిప్రాయభేదములేర్పడి, అవి సంకుల సమరానికి దారితీయ పరిస్థితులేర్పడినప్పుడు ఆ ప్రమాద పరిస్థితిని తప్పించడానికి ఇవి ఎంతో తోడ్పడాయి. అందుకు ఆ రాయబారాలు నడిపిన వారి సమయస్ఫూర్తి సమ్యక్ జ్ఞానములపై ఆ ఫలితములు మరింత ఆధారపడి ఉంటాయి.

ఈ దృష్టితో పరిశీలించినపుడు, మహాకవి తిక్కన నడిపించిన రాయబారాలు రెండూ… సంజయ రాయబారం, శ్రీకృష్ణ రాయబారం కూడా రాజకీయ చతురతకు రమణీయ ప్రతిబింబములు. అందులో మొదట సాగిన సంజయ రాయబారమునకు తిక్కన అవలంబించిన చాతుర్యము రాజకీయ విజ్ఞులకు వరవడిగా కలకాలము నిలువగలదు.

సంజయ రాయబారం పఠించునపుడు పఠితల మనోఫలకమునందొక అపూర్వ నాటక ప్రదర్శనము గోచరించునని దానిని రచించిన తిక్కన ప్రతిభా విశేషములను గురించి వేరే వివరించుట అనవసరము. నేటి పారిభాషిక పద జాలంలో చెప్పాలంటే గొప్ప అనుభవజ్ఞుడైన దర్శకుని చేతిలో రూపొందిన నిర్దుష్టమైన చలనచిత్రమువలె భాసించినది ఆ ఘట్టము.

నిండు పేరోలగంలో ఉన్న ధృతరాష్ట్ర మహారాజు, రాయబారిగా పంపే సంజయునితో చెప్పవలసిన మాటలు చెప్పి కడసారి సూచనగా ‘నెయ్యము పాటించి, అలుకలెల్ల తీరునట్లు ఆ యమనందనుండు
కయ్యమను తలపు కూడ మనస్సులోనికి రానీయని విధమున, తియ్యగా మాట్లాడి, శాంతి ప్రకారంబునం గార్యంబునడపి రమ్ము అని పంపాడు. ఆ వెళ్లడం రథం మీద వెళ్లమన్నాడు. తమ అర్హతకి తగిన విధంగా రాయబారి ఉండడం సహజం కదా!

ఆ రాజు మాటలు అక్షరాలా పాటించాడు రాయబారి సంజయుడు. అంతేకాదు, ఆ రాజు చెప్పని మాటలు కూడా సమయోచితంగా మాట్లాడి తన పాత్రను అద్భుతంగా నిర్వహించాడు.
ఉపప్లాన్యానికి వచ్చిన సంజయుడు తిన్నగా ధర్మరాజు కొలువు కూటానికి వెళ్లలేదు. దారిలో ఆగి, మాధవ మందిరానికి వెళ్లాడు. అక్కడేఉన్న అర్జునుని, ఆ శ్రీకృష్ణుని, భయభక్తి వినయ సంభ్రమములతో సేవించి, వారితో తగురీతి మాటలాడి తిరిగి వచ్చి, ఆ మరునాడు వెళ్లాడు ధర్మరాజు కొలువు కూటానికి.

రాయబారానికి వచ్చినవాడు తిన్నగా ధర్మరాజు దగ్గరకి వెళ్లకుండా మధ్యలో కృష్ణార్జునులను దర్శించడం ఎందుకు? అక్కడే ఉంది గమ్మత్తు! అద్భుతమైన రాజకీయపుటెత్తు!పాండవ ప్రభుత్వంలో ధర్మరాజాదులు పేరుకి మాత్రమే ప్రభువులు కాని యదార్థమైన అధికార భావాలు కలవారు ఆ కృష్ణార్జునులే. వారిని కాదని ధర్మ రాజేమీ చేయలేదు. అందుకని ముందుగా వారి అభిప్రాయాలను తెలుసుకుంటే, రేపు సభలో మాట్లాడ వలసిన తీరు నిర్ణయించుకోడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా! అందుకనే అఖండ రాజ నీతి కుశలుడైన సంజయుడు ఆ విధంగా చేశాడు.

అంతేకాదు, సంజయుడు వారితో ఏమి మాట్లాడినదీ, వారేమి చెప్పినదీ కూడా తిక్కన అక్కడ చెప్పాడు. రాయబారం అంతా అయిపోయి తిరిగి హస్తినాపురానికి వెళ్లిపోయిన తరువాత, ధృత రాష్ట్రునితో ఏకాంత సమావేశం అయిపోయిన తరువాత, ఆ మరునాడు నిండుసభలో అందరూ వింటూండగా అప్పుడు చెబుతాడు సంజయుడు.

కృష్ణార్జునులు ఏమి చెప్పినది అంతవరకు అది ఒక రకమైన నిగూఢ విషయంగా ఉండిపోతుంది. ఆ నిగూఢకత్వాన్ని సంజయుడు మరునాడు ధర్మరాజు కొలువులో మాట్లాడినప్పుడు కూడా చెప్పడు. ఆ సభలో కృష్ణార్జునులూ ఉంటారు. తానూ ఉంటాడు. అయినా ఒకరు కూడా తామింతకు ముందు మాట్లాడుకున్నట్టే తేలరు. సమర్థుడైన రాయబారికి రహస్య గోపనం అంత అవసరం అని నిరూపించి నాడు తిక్కన చేతిలోని సంజయుడు.

ఇక ఆ మరునాడు ధర్మరాజు కొలువులో జరిగిన విషయాలు రాజకీయ నీతికి మరింత ప్రబల నిదర్శనాలు, సాధారణ పద్ధతిలో క్షేమ సమాచారాలు ప్రస్తావించాడు సంజయుడు. ధర్మరాజుతో అతనిని చూడడంవల్ల తన కన్నులు ధన్యత చెందాయన్నాడు.

– ర్యాలి సూర్యనారాయణ