News

సెక్యులరిజం యూరోపియన్ భావన.. భారత్‌లో అవసరం లేదు: తమిళనాడు గవర్నర్

27views

సెక్యులరిజం అన్నది యూరోపియన్ భావన అని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తెలిపారు. భారతీయులకు ఇది అవసరం లేదని అన్నారు. లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు మోసం జరిగిందని ఆయన ఆరోపించారు. సెప్టెంబరు 22న కన్యాకుమారిలో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి మాట్లాడారు. ‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి. వాటిలో ఒకటి లౌకికవాదానికి తప్పుడు భాష్యం. లౌకికవాదం అంటే ఏమిటి? లౌకికవాదం అనేది యూరోపియన్ భావన. భారతీయ భావన కాదు’ అని అన్నారు.

కాగా, ఐరోపాలో చర్చికి, రాజుకు మధ్య జరిగిన ఘర్షణ వల్ల సెక్యులరిజం భావన వచ్చిందని గవర్నర్ ఆర్‌ఎన్ రవి తెలిపారు. అయితే స్వాత్రంత్యం తర్వాత భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో ఎవరో సెక్యులరిజం గురించి చర్చించారని చెప్పారు. ‘రాజ్యాంగ పరిషత్ ఏం చెప్పింది. మన దేశంలో సెక్యులరిజం ఉందా? ఏదైనా సంఘర్షణ జరిగిందా?’ అని ప్రశ్నించారు. ధర్మం నుంచి భారతదేశం పుట్టిందని, అలాంటప్పుడు ధర్మంలో వైరుధ్యం ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘సెక్యులరిజం అనేది యూరోపియన్ భావన. అది అక్కడే ఉండాలి. భారత్‌లో సెక్యులరిజం అవసరం లేదు’ అని అన్నారు.

మరోవైపు 1976లో రాజ్యాంగ పీఠికలో ‘సెక్యులరిజం’ అనే పదాన్ని చేర్చిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఈ సందర్భంగా విమర్శించారు. ‘25 సంవత్సరాల తరువాత, ఎమర్జెన్సీ కాలంలో, అసురక్షిత ప్రధానమంత్రి, కొన్ని వర్గాల ప్రజలను సంతోషపెట్టే ప్రయత్నంలో లౌకికవాదాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు’ అని వ్యాఖ్యానించారు.