News

చంద్రుడిపై రయ్‌ రయ్‌మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..

36views

చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్‌ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్‌ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం ప్రయాణం చేయడానికి వీలుగా ఒక ప్రెషరైజ్డ్‌ రోవర్‌ను జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం టయోటా కంపెనీ తయారు చేస్తున్నది. నాసా చేపట్టనున్న అర్టెమిస్‌ 7 మిషన్‌ కోసం ఈ రోవర్‌ను వినియోగించనున్నారు. టైర్లతో కూడిన ఈ రోవర్‌(వాహనం)లో వ్యోమగాములు చంద్రుడిపై ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు.

ఇందులోనే కొంతకాలం నివసించవచ్చు. చంద్రుడిపై అధ్యయనం జరపడానికి అవసరమైన శాస్త్రీయ పరికరాలు కూడా ఇందులో ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది కారవాన్‌, మొబైల్‌ ల్యాబ్‌ కలగలిసిన వాహనం. చంద్రుడిపై ప్రతికూల వాతావరణం, రేడియేషన్‌ ప్రభావం వ్యోమగాములపై పడకుండా దీనిని రూపొందిస్తున్నారు. ఈ రోవర్‌ తయారీ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీ(జేఏఎక్స్‌ఏ) కలిసి పని చేస్తున్నాయి.