News

సిరిమాను చెట్టుకు బొట్టు

20views

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసు చెట్లకు పెదతాడివాడలో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి బొట్టు పెట్టారు. పెదతాడివాడలోని మజ్జి అప్పారావు కల్లంలో గుర్తించిన ఈ చెట్లకు బొట్టు పెట్టే కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పూజారి బంటుపల్లి వెంకటరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు కలశాలతో వచ్చి అమ్మవారి చెట్టుకు నీరు పోసి, పసుపు కుంకుమలు, బొట్టు పెట్టి పూజలు నిర్వహించారు. దీంతో పెదతాడివాడలో ఆధ్యాత్మిక సందడి కనిపించింది. పైడితల్లి అమ్మవారి ఆలయ కార్యనిర్వహణాధికారి డీవీవీ ప్రసాదరావు, మాన్సాస్‌ ట్రస్ట్‌ డిప్యూటీ కమిషనర్‌ కేఎన్‌డీవీ ప్రసాద్‌, ఆలయ సిబ్బంది, గ్రామపెద్దలు చిరంజీవిరాజు, వాసురాజు, కరుమజ్జి త్రినాధరావు, గాదిపల్లి రమేష్‌, చింతపల్లి రామ్మూర్తి, పడాల చిన్నారావు, పొంతపల్లి జగన్నాధం, కోరాడ రమణ, వెంపడాపు రమణ, తుమ్మి లక్ష్మిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

28న సిరిమాను చెట్టు సేకరణ
పెదతాడివాడలో గుర్తించిన అమ్మవారి సిరిమాను, ఇరుసు చెట్లను ఈ నెల 28వ తేదీన ఉదయం 8 గంటలకు శాస్త్రోకంగా పూజలు చేసి సేకరిస్తామన్నారు. కార్యక్రమాన్ని భక్తులు విజయవంతం చేయాలని కోరారు.

పండగకు పక్కా ఏర్పాట్లు
వచ్చే నెల అక్టోబర్‌ 15న జరిగే విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని పైడితల్లి అమ్మవారి ఆలయ కార్యనిర్వహణాధికారి డీవీవీ ప్రసాదరావు చెప్పారు. దీనిలో భాగంగా డెంకాడ మండలంలోని పెదతాడివాడలో గుర్తించిన అమ్మవారి సిరిమాను, ఇరుసు చెట్లకు పూజారి బంటుపల్లి వెంకటరావు పసుపు, కుంకుమ రాసి బొట్టు పెట్టారన్నారు. ఈ నెల 28న చెట్లను ఊరేగింపుగా విజయనగరం తరలిస్తామన్నారు. చెట్టును సిరిమానుగా తయారు చేయిస్తామన్నారు. రాష్ట్ర పండగగా పైడితల్లి అమ్మవారి పండగను గుర్తించడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.