ArticlesNews

హిందుత్వపై దాడి: టిటిడిలో హిందూ ముసుగులో క్రైస్తవుల నియామకాలు

7views

లడ్డూ కల్తీ వివాదంతో ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తిరుమలలో హిందువుల ముసుగులో అన్యమతస్తులు, ముఖ్యంగా క్రైస్తవులు టిటిడిలోని కీలక విభాగాల్లో నియమితులు అవుతుండడం వల్లనే ఇలాంటి వివాదాలకు అవకాశం కలుగుతోందన్న వాదనలూ తెరమీదకు వచ్చాయి. ప్రపంచంలోని హిందువులందరూ పరమ పవిత్రంగా కొలిచే తిరుమల వెంకన్న సన్నిధిలో రాజకీయ జోక్యం కారణంగా ఆ పుణ్యక్షేత్రపు పవిత్రత క్షీణిస్తోంది. హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీసి, అన్యమతాలను ప్రచారం చేయడం కోసం అలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అటువంటి ఆరు సంఘటనలను ఒక్కసారి పరికిద్దాం.

1. టిటిడి చైర్మన్‌గా హిందూ ముసుగులోని క్రైస్తవుడి నియామకం:

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి 2023 ఆగస్టు 5న మరోసారి టిటిడి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదటిసారి టిటిడి ఛైర్మన్ అయారు. ఆయన హిందువునని చెప్పుకుంటారు కానీ క్రైస్తవ మతంతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన కూతురికి సైతం క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసారు.

2. టిటిడి పాఠశాలల్లో క్రైస్తవ ఉపాధ్యాయుల నియామకం:

తమిళనాడు వెల్లూరులో టిటిడి నిర్వహణలోని శ్రీ వేంకటేశ్వర హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఉపాధ్యాయులుగా ముగ్గురు క్రైస్తవులను నియమించారు. ఆ రాష్ట్ర పాఠశాల విద్యా విభాగం వారికి ఆ పాఠశాలలో ఉద్యోగమివ్వడం గమనార్హం. హిందూ సంస్థల్లోకి హైందవేతరులు అక్రమంగా చొచ్చుకుని చొరబడిపోతుండడం ఆందోళనకరం.

3. హిందూ ముసుగులో క్రైస్తవ ఉద్యోగి:

టిటిడి హుండీ లెక్కింపు విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎ. రాజశేఖరరావు రహస్యంగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని 2020 జులై నెలలో వెల్లడయింది. రాజశేఖర్ అధికారిక పత్రాల్లో హిందువుగానే నమోదు చేయించుకున్నారు. ఆయన చర్చిలో ప్రార్థనలు చేస్తూ, అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటూ దొరికిపోయారు. టిటిడిలో ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ మీద అనుమానాలు పెరగడానికి ఆ సంఘటన ఒక ప్రధాన కారణమైంది.

4. టిటిడిలో 44మంది హైందవేతర ఉద్యోగులు:

2018 జనవరిలో చేసిన ఆడిట్‌లో ఒక దిగ్భ్రాంతికర వాస్తవం వెలుగు చూసింది. టిటిడిలో 44మంది హైందవేతరులు వివిధ స్థాయుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో అత్యధికులు క్రైస్తవులు. వారిలో ఎక్కువమంది 1989 నుంచి 2007 వ్యవధిలో నియమితులయ్యారు. అంటే టిటిడిలో రాజకీయ జోక్యంతో హైందవేతరుల నియామకం ఏనాటి నుంచో జరుగుతున్నదన్న మాటే.

5. టిటిడి ట్రస్టుబోర్డులో క్రైస్తవ ఎమ్మెల్యే:

2018లో పాయకరావుపేట ఎమ్మెల్యే అయిన వంగలపూడి అనితను టిటిడి ట్రస్టుబోర్డులో నియమించడం వివాదానికి దారితీసింది. తాను క్రైస్తవురాలినని, ఏసుక్రీస్తు భక్తురాలిననీ ఒక మీడియా ఇంటర్‌వ్యూలో స్వయంగా ఆమే వెల్లడించింది. అటువంటి క్రైస్తవురాలు హిందూమతసంస్థ బోర్డులో ఉండడం ఆందోళన కలిగించింది. ఆమె నియామకం వెనుక ప్రభుత్వ ఉద్దేశాల మీదనే అనుమానాలు రేకెత్తించింది. ఇప్పుడు ఆమె ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉండడం గమనార్హం.


6. అధికారిక వాహనంలో చర్చికి వెళ్ళిన టిటిడి ఉద్యోగిని:

2017 డిసెంబర్‌లో టిటిడి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్నేహలత, టిటిడి అధికారిక వాహనంలోనే క్రమం తప్పకుండా లూథరన్ చర్చికి వెడుతూన్న సంగతి వెల్లడైంది. ఆమె అందరికీ కనబడేలాగానే టిటిడి వాహనంలో చర్చికి వెళ్ళి వస్తుండేది. టిటిడిలో పనిచేస్తూ వేంకటేశ్వర స్వామి పట్ల భక్తి లేకుండా ఉండడం, స్వామివారి ప్రసాదం తీసుకోడానికి ఆమె నిరాకరించడం, హిందూ సంప్రదాయాలు ఆచారాల పట్ల ఆమె విముఖత… హిందువులకు ఆగ్రహావేశాలు కలిగించాయి.

హిందూ సెంటిమెంట్లను అవమానించడంలో ఒక పద్ధతి:

ఇవేమీ విడివిడిగా, సంబంధం లేకుండా జరిగిన సంఘటనలు కావు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే దేవాలయ వ్యవస్థలను రాజకీయం చేయడం, తద్వారా హిందూ ధర్మాన్ని అవమానించడం వెనుక నిగూఢమైన అజెండా ఉందని అర్ధమవుతుంది. ఇటువంటి నియామకాలు హిందువుల మనోభావాలను దెబ్బతీయడం మాత్రమే కాదు, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మతాన్ని పనిముట్టుగా వాడుకునే రాజకీయ నాయకుల వైఖరిపట్ల ఆందోళన కలగజేస్తాయి.

టిటిడి కేవలం నిర్వాహక వ్యవస్థ మాత్రమే కాదు, అది ఒక విశ్వాసానికి ధర్మకర్త. తమతమ అజెండాల గంతలు కట్టుకుని గుడ్డివారిగా మారిన రాజకీయనాయకులకు హిందూ దేవాలయాల ఆధ్యాత్మిక ప్రాధాన్యం తెలియదు. అటువంటి వారు టిటిడి వంటి నిర్వహణా వ్యవస్థలను కేవలం ఆస్తులుగా మాత్రమే పరిగణిస్తారు. పైన మనం చూసిన ఉదాహరణలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విశృంఖల స్వైర స్వభావాలు. హిందూ దేవాలయాల రాజకీయీకరణను నిలిపివేయడం, ఆ పరమగౌరవప్రద వ్యవస్థల పవిత్రతను పునరుద్ధరించడం ఇప్పుడు అత్యవసరం.