News

యువతను సన్మార్గంలో నడిపించడమే లక్ష్యం

18views

శివపదాలను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. కళాభారతి ఆడిటోరియంలో విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ, విశాఖ రుషిపీఠం సత్సంగ సభ సంయుక్త ఆధ్వర్యంలో ‘శివ పదం సంకీర్తన యజ్ఞం’ కార్యక్రమం జరిగింది. ముందుగా అకాడమీ అధ్యక్షుడు ఎం.ఎస్‌.ఎన్‌.రాజు, కార్యదర్శి డా.రాంబాబు, ప్రధాన నిర్వాహకులు కందాళి వెంకట సత్యశ్యామ్‌, అరుణ గాయత్రి, వి.వి.ఆదినారాయణ మూర్తి జ్యోతి ప్రజ్వలన చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనాలు కొనసాగాయి. ఆధునిక సమాజాన్ని, యువతను సన్మార్గం వైపు నడిపించడం ఆధ్యాత్మికతతోనే సాధ్యమన్నారు. శివపదం ప్రతి నోటా జపించేలా చేయడమే దానికి సరైన మార్గమన్నారు. పరమ శివుడిని ధ్యానించే వారికి సులభతరంగా ఉండేలా కొన్ని పద్యాలను రచించామన్నారు. శివపదం స్తుతించడం ద్వారా మానసిక వికాసం లభిస్తుందన్నారు. శబ్ద, బ్రహ్మ స్వరూపమైన శివ నామస్మరణ ఆవశ్యకతను యువతకు దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం నల్లాన్‌ చక్రవర్తుల కౌశిక్‌ కల్యాణ్‌ తమ బృందగానంతో సభికులను అలరించారు. వేజేటి శ్రీరామాచార్యులు, దోర్భల ప్రభాకర శర్మ తదితరులు పాల్గొన్నారు.