News

సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలి : పాకిస్థాన్‌కు నోటీసు

18views

సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని భారత్‌ డిమాండ్‌ చేసింది. 1960లో పాక్‌తో కుదిరిన ఈ ఒప్పందాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు మోదీ సర్కారు పాకిస్థాన్‌కు నోటీసు ఇచ్చింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించడంతో పాటు నిబంధనల్లో మార్పులు చేయాల్సి ఉందని ఆగస్టు 30న పాక్‌కు ఇచ్చిన నోటీసులో స్పష్టం చేసింది. ఒప్పందంలోని ఆర్టికల్‌ 12(3) ప్రకారం ఇరు దేశాలు నిబంధనలను ఎప్పటికప్పుడు సవరించుకోవాల్సి ఉంటుంది. సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్‌ ఉదారంగా వ్యవహరిస్తుండగా.. పాకిస్థాన్‌ మాత్రం దీన్ని అదనుగా తీసుకొని భారత్‌ వైపు నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలోనే 1960లో కుదిరిన ఒప్పందాన్ని సమీక్షించాలని డిమాండ్‌ చేస్తోంది. ఒప్పందం జరిగిన నాటి పరిస్థితులకు, నేటి పరిస్థితులకు మధ్య చాలా మార్పులు చోటుచేసుకున్నాయని, ఒప్పందంలోని పలు అధికరణల కింద సింధు జలాలపై పునఃపరిశీలన అవసరమని పేర్కొంటున్నారు. జనాభా లెక్కలు మారిపోవడంతో వ్యవసాయ, ఇతర అవసరాలకు నదీ జలాల వినియోగం పెరగడం; భారతదేశ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకోవడం కోసం స్వచ్ఛ ఇంధనాన్ని అభివృద్ధి చేయడం; జమ్మూకశ్మీరులో పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం వంటి కారణాల నేపథ్యంలో భారత్‌ ఈ ఒప్పందంలో తన హక్కులను పూర్తిగా వినియోగించుకోవాలని నిర్ణయించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

రాట్లే, కిషన్‌గంగా జల విద్యుత్తు ప్రాజెక్టుల నిర్వహణపై సుదీర్ఘకాలంగా వివాదం కొనసాగడం కూడా పాకిస్థాన్‌కు నోటీసు ఇవ్వడానికి ఓ కారణంగా భావిస్తున్నారు. సింధు జలాల ఒప్పందంపై భారత ఉదారతను పాక్‌ అవకాశంగా తీసుకుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మధ్యవర్తిత్వం, తటస్థ నిపుణుల వ్యవస్థలను కూడా వినియోగించుకోకపోవడం వంటి పరిణామాలతో సమస్య మరింత జటిలమైంది. ఈ క్రమంలోనే ఒప్పందంలోని వివాద పరిష్కార యంత్రాంగాన్ని సమీక్షించాలని కూడా భారత్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందాన్ని పునఃపరిశీలించాలంటూ జమ్మూకశ్మీరు ప్రజలు కూడా డిమాండ్‌ చేస్తుండడం విశేషం. పంజాబ్‌, హరియాణాల్లో కూడా నదీ జలాల అంశం ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉంది.