News

పోలీసుల అదుపులో గుప్త నిధి వేటగాళ్లు

3views

గుప్త నిధి వెలికి తీసేందుకు వెళుతున్న ఓ ముఠాను అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి రాయదుర్గంలోని బళ్లారి మార్గంలో కుంటు మారెమ్మ ఆలయం సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన కేఏ50పీ 7097 నంబరు గల కారును ఆపి తనిఖీ చేశారు. కారులో ఆరుగురితో పాటు గ్యాస్‌ కట్టర్లు, రెండు గ్యాస్‌ సిలిండర్లు, గడ్డపారలు, చెలికి, పూజాసామగ్రి, ఓళిగ, కుంకుమ గుర్తించారు. ఈ లోపు దుండగుల్లో ఇద్దరు అక్కడి నుంచి పారిపోవడంతో నలుగురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. గుప్తనిధి వెలికి తీసేందుకే వారు వెళుతున్నట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించుకున్న పోలీసులు… నిందితులను తమ అదుపులో ఉంచుకుని విచారణ చేస్తున్నారు.

కాగా, రాయదుర్గం మండలం చదం గ్రామ సమీపంలోని లింగాలబండపై కొలువుదీరిన చతుర్ముఖ పశుపతినాథ ఆలయంలో ఈ నెల 12న రెండు నంది విగ్రహాలను దుండగులు ద్వంసం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న దుండగులు… విగ్రహాలు ధ్వంసం చేసిన వారు ఒక్కరేననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దేశంలో నేపాల్‌ తర్వాత లింగాలబండపై వెలసిన ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శివలింగానికి నాలుగువైపులా కొలువుదీరిన నందీశుల విగ్రహాల్లో రెండింటిని దుండగులు ధ్వంసం చేశారు. వాటిలో వజ్రాలు ఉండొచ్చనే అనుమానంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు వదంతులు వ్యాపించాయి. గుప్తనిధులు తవ్వేందుకు వెళుతూ ఆ ప్రాంత సమీపంలోనే దుండగులు పోలీసులకు పట్టుబడడం పశుపతినాథుడి మహిమేనని భక్తులు భావిస్తున్నారు.