ArticlesNews

వేద విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న ఎస్వీ వేదిక్‌ యూనివర్సిటీ

7views

టీటీడీ ఆధ్వర్యంలో 2006లో వేద విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో ఎస్వీ వేదిక్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 21 విభాగాలలో శాస్త్ర, ఆచార్య, పీహెచ్‌డీ, డిప్లొమో, సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తున్నారు. ప్రస్తుతం టీటీడీలోనే కాకుండా దేశవిదేశాల్లోని ఆల యాల్లో పలు హోదాల్లో వేదిక్‌ వర్సిటీ విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. వర్సిటీలో కోర్సులు పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థీ వంద శాతం ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. దేశంలో ఈ స్థాయి ఉన్నత విద్యను అందిస్తున్న సంస్థకానీ, విశ్వవిద్యాలయంగానీ మరొకటి లేదనడంలో అతిసయోక్తికాదు.


మా సొంతూరు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని శీతాపూర్‌పట్నం. అమ్మానాన్న వ్యవసాయ కూలీలు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. వేద విద్యలో డిగ్రీ, పీజీ చేయాలనే ఆశయం ఉండేది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి బీఏ (శాసీ్త్రయ) సామవేదం విభాగంలో చేరాను. అధ్యాపకుల మార్గదర్శకంలో ప్రథమ శ్రేణిలో సామవేదంలో 2023లో బీఏ డిగ్రీ సాధించాను. పీజీ (ఆచార్య)లో మొదటి ఏడాది అడ్మిషన్‌ పొందిన వెంటనే అయోధ్య రామమందిరంలో శాశ్వత ప్రాతిపదికన 20 అర్చక పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశ వ్యాప్తంగా సుమారు 6 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కఠోర శ్రమతో 6 వేల మందితో పోటీపడి ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం రామమందిరంలో శాశ్వత అర్చకునిగా పనిచేస్తున్నాను. రోజుకు 6 నుంచి 8 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నా. కటింగ్స్‌ పోను రూ.40 వేల వరకు జీతం వస్తోంది. మాకు కావలసి వసతి, భోజన సౌకర్యాలు అన్నీ ఉచితం. ఈ స్థాయికి చేర్చిన వర్సిటీకి, అధ్యాపకులకు రుణపడి ఉంటా.


అయోధ్య రామాలయంలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దీనికోసం క్రమశిక్షణతో అధ్యాపకుల సలహాలతో విద్యనభ్యసించా. మాది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అయోధ్య పట్టణం. నాన్న వృత్తి రీత్యా పౌరోహిత్యం (కర్మకాండ) చేస్తుంటారు. వచ్చే ఆదాయం కుటుంబ పోషణకే చాలేది కాదు. నేను వేద విద్యను పూర్తిస్థాయిలో చదవాలని నాన్నకు కోరిక ఉండేది. ఎస్వీ వేదిక్‌ వర్సిటీలో శుక్ల యజుర్వేదంలో బీఏ (శాసీ్త్రయ) కోర్సులో 2020లో చేరి 2023లో పూర్తి చేశాను. తిరుపతి వేదిక్‌ వర్సిటీ వేద విద్యకు పెట్టింది పేరు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు వర్సిటీలో వేద విద్య తప్ప వేరే ధ్యాస ఉండదు. అయోధ్య రామాలయంలో అర్చక ఉద్యోగాలకునోటిఫికేషన్‌ విడుదల కాగానే దరఖాస్తు చేసుకుని ఉద్యోగం సాధించా. నాన్న కోరిక నెరవేర్చా. నా కాళ్లపై నేను నిలబడ్డా. ప్రధాన ఆలయంలోని కోందడరాముని చెంత అర్చక వృత్తితో నా జీవితం ధన్యమైంది.–మయాంక్‌ త్రిపాఠి, అర్చకులు, అయోధ్యరామాలయం, యూపీ