News

రాఖీ కడితే ఊరు వదలాల్సివస్తుందట!

34views

దేశ వ్యాప్తంగా ఈరోజు (సోమవారం) రాఖీ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలోని ప్రజలు రాఖీ పండుగ చేసుకోరు. దీని వెనుక వారు ఒక కారణాన్ని చూపుతుంటారు. రాఖీ చేసుకుంటే అన్నదమ్ములు ఊరు వదలాల్సి వస్తుందని వారు చెబుతుంటారు.

యూపీలోని సంభాల్ జిల్లా బేనిపూర్ చక్ గ్రామంలో మచ్చుకైనా రాఖీ వేడుకలు కనిపించవు. రక్షాబంధన్‌ పేరు వినగానే ఇక్కడి ప్రజలు హడలిపోతుంటారు. రాఖీ నాడు తన సోదరి ఏదైనా బహుమతి అడిగితే, సర్వం కోల్పోయి, ఇంటిని విడిచి వెళ్లాల్సి వస్తుందని ఇక్కడి అన్నదమ్ములు భయపడుతుంటారు.

గ్రామ పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో ఒకప్పుడు యాదవులు, ఠాకూర్‌ల ఆధిపత్యం ఉండేదట. నాడు ఇక్కడి జమిందారు ఠాకూర్‌ కుటుంబానికి చెందినవాడు. అయితే అతనికి మగ సంతానమే లేదట. దీంతో ఒకసారి రాఖీ పండుగనాడు యాదవుల ఇంటి ఆడపిల్ల ఆ ఠాకూర్‌కు రాఖీ కట్టి, అతని జమిందారీని కానుకగా అడిగిందట.

ఈ నేపధ్యంలో నాడు యాదవులకు, ఠాకూర్‌లకు వివాదం జరిగిందని చెబుతారు. చివరికి ఆ ఠాకూర్‌ తన జమిందారీని యాదవులకు అప్పగించి, ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. నాటి నుంచి ఈ గ్రామంలో ఎవరూ రాఖీ పండుగను చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అది ఈ నాటికీ గ్రామంలో కొనసాగుతోంది.