News

తుంగా తీరంలో శ్రీరాఘవేంద్రుల 353వ సప్తరాత్రోత్సవాలు

31views

వేదభూమి మంత్రాలయంలో శ్రీరాఘవేంద్ర స్వామి 353వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

సప్తరాత్రోత్సవాల సందర్బంగా ప్రతీ రోజూ రాయరు రథోత్సవాలతోపాటు రాములోరి సంస్థాన పూజలు ఉంటాయి. భక్తుల కోసం యోగీంద్ర మంటపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఆదివారం ధ్వజారోహణ, ధాన్యపూజ, గోవు, తురగ పూజ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పట్టువస్త్రాల సమర్పించారు. సోమవారం నాడు శాఖోత్సవం నిర్వహించి రజత మంటపోత్సవం చేపడతారు.

ఉత్సవాల్లో మూడోరోజున అంటే మంగళవారం పూర్వారాధన సందర్భంగా సింహవాహనంపై ప్రహ్లాదరాయల ఊరేగింపు నిర్వహిస్తారు. బుధవారం మధ్యారాధన పురస్కరించుకుని రాఘవేంద్రుల మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం చేస్తారు. రాత్రి గజవాహనోత్సవంతోపాటు రజత, సువర్ణ రథోత్సవాలు ఉంటాయి. మహా రథోత్సవం, వసంతోత్సవం భక్తశ్రద్ధలతో నిర్వహిస్తారు.

గురువారం నాడు రాఘవేంద్రుల మహా రథోత్సవం అంగరంగ వైభవంగా చేపడతారు. హెలికాప్టర్‌తో పూలు చల్లుతారు. శుక్రవారం పూర్వపు పీఠాధిపతి సుజ్ఞానేంద్రుల ఆరాధన, అశ్వవాహన సేవలు ఉంటాయి. శనివారం నాడు సర్వ సమర్పణోత్సవంలో భాగంగా బంగారు పల్లకీ, చెక్క, వెండి, బంగారు రథోత్సవ సేవలు నిర్వహించనున్నారు.

ఆనవాయితీలో భాగంగా శ్రీరాఘవేంద్రస్వామి అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేయనున్నారు. మైసూరు రాజవంశీకులు, పార్లమెంట్‌ సభ్యుడు యధువీర్‌ కృష్ణదత్త ఛామరాజేంద్ర వడియార్‌ ప్రత్యేక అతిథిగా వచ్చి ప్రశస్థి అవార్డు స్వీకరించనున్నారు.
బీజీఎస్‌ గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రకాశనాథ స్వామిజీ, విద్వాన్‌ రఘుపతి ఉపాధ్యాయ, ప్రొఫెసర్‌ వజ్ర భూషణ్‌ ఓజాకు అవార్డు అందజేయనున్నారు.

మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్‌–1 శ్రీనివాసరావు, మేనేజర్‌–2 వెంకటేష్‌జోషి, మేనేజర్‌–3 శ్రీపతిఆచార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సురేష్‌ కోనాపూర్‌, పీఆర్వో నరసింహామూర్తి ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.