News

లష్కరే ఉగ్రవాదితో పాకిస్తానీ ఒలింపిక్ స్వర్ణపతక విజేత వీడియో వైరల్

36views

పారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కు స్వర్ణపతకం తెచ్చిపెట్టిన జావెలిన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ గతంలో లష్కరే తయ్యబా ఉగ్రవాదితో కలిసి ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇస్లామిక్ ఉగ్రవాద కుటీర పరిశ్రమ మన పొరుగు దేశాల్లోని సామాన్య ప్రజల జీవితాల్లోకి ఎంతగా చొచ్చుకుని వెళ్ళిపోయిందన్న విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది.

ఆ వీడియోలో అర్షద్ నదీమ్, లష్కరే తయ్యబా ఉగ్రవాది మొహమ్మద్ హారిస్ దర్‌తో మాట్లాడుతున్నాడు. నదీమ్ సాధించిన ఘనత మొత్తం ముస్లిం సమాజానికి గర్వకారణమైందని దర్ నదీమ్‌కు చెబుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.

లష్కరే తయ్యబాను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. ఆ సంస్థకు చెందిన ప్రముఖ ఉగ్రవాది హఫీజ్ సయీద్, లష్కరే సంస్థకు రాజకీయ ముఖంగా మిలీ ముస్లింలీగ్ అనే పార్టీని స్థాపించాడు. ఆ రాజకీయ పార్టీకి సంయుక్త కార్యదర్శిగా మొహమ్మద్ హారిస్ దర్ వ్యవహరిస్తున్నాడు. 166మంది భారతీయ ప్రజల ప్రాణాలు తీసిన 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్. అలాగే, మిలీ ముస్లింలీగ్ నేతలను 2018లోనే అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించారు. వారిలో దర్ కూడా ఉన్నాడు.

అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ 2018లో విడుదల చేసిన పత్రికా ప్రకటన ‘‘మిలీ ముస్లింలీగ్ కేంద్ర నాయకత్వంలో ఏడుగురు సభ్యులను నిర్దిష్టంగా ఉగ్రవాదులుగా గుర్తించడం జరిగింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ 2001 డిసెంబర్‌లో ఉగ్రవాద సంస్థగా గుర్తించిన లష్కరే తయ్యబా సంస్థ తరఫున పనిచేస్తున్నందుకు మిలీ నాయకులు సైఫుల్లా ఖలీద్, ముజమ్మిల్ ఇక్బాల్ హష్మీ, మొహమ్మద్ హారిస్ దర్, తాబిష్ ఖయ్యూమ్, ఫయ్యాజ్ అహ్మద్, ఫైజల్ నదీమ్, మొహమ్మద్ ఎహ్సాన్‌లను ఉగ్రవాదులుగా ప్రకటించాం’’ అని చెబుతోంది.

అమెరికా రికార్డుల ప్రకారం మొహమ్మద్ హారిస్ దర్ లష్కరే తయ్యబా తరఫున పనిచేసినట్లు గుర్తించారు. ‘‘దర్ మిలీ ముస్లింలీగ్ సంయుక్త కార్యదర్శి. గతంలో లష్కరే తయ్యబా విద్యార్ధి విభాగం ‘అల్ మహమ్మదీయా స్టూడెంట్స్ (ఎఎంఎస్)’లో అధికారిగా పనిచేసాడు. ఎఎంఎస్ అనేది లష్కరే తయ్యబాకు ముసుగు సంస్థ. దర్ 2016 ప్రారంభంలో లష్కరే తయ్యబా శిక్షణా శిబిరంలో ఫైర్‌ఫైటింగ్, ఫస్ట్‌ఎయిడ్ విభాగాల్లో శిక్షణ పొందాడు. ఆయుధాలు ప్రయోగించడంలోనూ, దాడులు చేయడంలో కూడా శిక్షణ తీసుకున్నాడు’’ అని ఆ రికార్డులు వెల్లడిస్తున్నాయి.

మొహమ్మద్ హారిస్ దర్ పాకిస్తాన్‌లో బహిరంగ సభల్లో తరచుగా భారత వ్యతిరేక ప్రసంగాలు ఇస్తుంటాడు. జమ్మూకశ్మీర్ విషయంలో భారతదేశం వైఖరిపై విషం చిమ్మాడు. ‘‘అమెరికా అప్ఘానిస్తాన్‌ నుంచి వైదొలగినట్లే భారత్ కూడా కశ్మీర్‌ నుంచి వైదొలిగేలా చేస్తాం’’ అంటూ దర్ బహిరంగ ప్రసంగాల్లో చెప్పేవాడు.