News

బ్రిటిష్‌ ఆర్కెస్ట్రా.. 14000 మంది చిన్నారులు: గిన్నిస్‌కెక్కిన గ్రామీ విజేత జాతీయ గీతాలాపన

47views

తన గానంతో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన భారతీయ సంగీత దర్శకుడు, గ్రామీ విజేత రిక్కీ కేజ్‌ (Ricky Kej).. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అద్భుతమైన వీడియోను రూపొందించారు. ప్రముఖ సంగీతకారుల సహకారంతో మన జాతీయ గీతాన్ని వైవిధ్యభరితంగా ఆలపించారు. బ్రిటిష్‌ ఆర్కెస్ట్రా, 14వేల మంది ఆదివాసీ చిన్నారులతో రూపొందించిన ఈ గీతాలాపన.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటు దక్కించుకోవడం విశేషం.

ఈ వీడియోను రిక్కీ కేజ్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. పండిత్‌ హరిప్రసాద్‌ చౌరాసియా, రాకేశ్‌ చౌరాసియా, రాహుల్‌ శర్మ, అమన్‌, అయాన్‌ అలి బంగాశ్‌, జయంతి కుమరేశ్‌, షేక్‌ మహబూమ్‌, కలీషాబీ మహబూబ్‌ వంటి ప్రముఖ క్లాసికల్‌ మ్యుజీషియన్లు తమ వాయిద్యాలతో జాతీయ గీతాన్ని ప్రత్యేకంగా పలికించారు. వీరితో పాటు యూకేలోని రాయల్‌ ఫిల్‌హార్మోనిక్‌ ఆర్కెస్ట్రాకు చెందిన 100 మంది సభ్యుల బృందం కూడా ఈ గీతాలాపనలో పాల్గొంది.

కలింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌కు చెందిన 14వేల మంది ఆదివాసీ చిన్నారులు భారతదేశ చిత్రపటం ఆకృతిలో, ‘భారత్‌’ ఆంగ్ల, హిందీ అక్షరక్రమంలో నిల్చొని జాతీయగీతాన్ని ఆలపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా రిక్కీ కేజ్‌ మాట్లాడుతూ.. ‘‘చిన్న వయసులో నేను విన్న తొలి మ్యూజిక్‌ మన జాతీయగీతమే. అత్యుత్తమ శాస్త్రీయ సంగీతకారులను ఒక వేదికపైకి తీసుకొచ్చి ఇలా జాతీయగీతాన్ని ఆలపించడం చాలా అద్భుతంగా ఉంది’’ అని ఆనందం వ్యక్తంచేశారు.

వీఆర్‌ ఫిల్మ్‌మేకర్‌ సాయిరామ్‌ సాగిరాజు, కొంతమంది డెవలపర్లతో కలిసి రిక్కీ ఇలా వర్చువల్‌ రియాల్టీ వెర్షన్‌ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ఆయన గతంలోనూ ఇలాంటి వైవిధ్యభరిత ప్రదర్శనలు ఇచ్చారు. 2023లో లండన్‌లోని అబే రోడ్‌ స్టూడియోస్‌ వద్ద అతిపెద్ద సింఫనీ ఆర్కెస్ట్రాతో జాతీయ గీతాన్ని ఆలపించారు.