News

కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌కు కీర్తిచక్ర

33views

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో నిరుడు సెప్టెంబరులో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైన కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌కు ప్రతిష్ఠాత్మక కీర్తిచక్ర పురస్కారం దక్కింది. ఆయనతోపాటు మరో ముగ్గురు భద్రతా సిబ్బంది- రైఫిల్‌మ్యాన్‌ రవికుమార్‌ (మరణానంతరం), మేజర్‌ మళ్ల రామగోపాల్‌ నాయుడు, జమ్మూకశ్మీర్‌ పోలీసు విభాగానికి చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్‌ హుమాయూన్‌ ముజమ్మిల్‌ భట్‌ (మరణానంతరం)లనూ కీర్తిచక్ర వరించింది. కర్నల్‌ మన్‌ప్రీత్‌ సీనియర్‌ అధికారి. 19-రాష్ట్రీయ రైఫిల్స్‌ సెకండ్‌-ఇన్‌-కమాండ్‌గా పనిచేస్తున్న సమయంలో సేనా మెడల్‌ పొందారు. అనంతనాగ్‌లో దట్టమైన అడవితో కూడిన కొండ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ను వీరోచితంగా ముందుండి నడిపిస్తుండగా ఆయన వీరమరణం పొందారు. ముజమ్మిల్‌ భట్‌ కూడా ఆదే ఆపరేషన్‌లో పోరాడుతూ అమరులవడం గమనార్హం.

శాంతి సమయంలో ఇచ్చే రెండో అత్యున్నత గ్యాలంట్రీ అవార్డు- కీర్తిచక్ర. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాల సిబ్బంది కోసం మొత్తంగా 103 గ్యాలంట్రీ అవార్డులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ఆమోదముద్ర వేశారు. 18 మందికి శౌర్యచక్ర అవార్డులు (నలుగురికి మరణానంతరం) దక్కాయి. 63 సేనా పతకాలు, ఒక బార్‌ టు సేనా పతకం, 11 నావో సేనా మెడల్స్, ఆరు వాయు సేనా పతకాలు కూడా తాజాగా ప్రకటించిన గ్యాలంట్రీ అవార్డుల్లో ఉన్నాయి. కర్నల్‌ పవన్‌సింగ్, మేజర్‌ సీవీఎస్‌ నిఖిల్, మేజర్‌ ఆశిష్‌ ధోన్‌చక్‌ (మరణానంతరం), మేజర్‌ త్రిపట్‌ప్రీత్‌సింగ్, సిపాయి ప్రదీప్‌సింగ్‌ (మరణానంతరం) తదితరులు శౌర్యచక్ర దక్కించుకున్నవారిలో ఉన్నారు. మేజర్‌ ధోన్‌చక్, సిపాయి ప్రదీప్‌సింగ్‌ కూడా అనంతనాగ్‌లో నిరుడు సెప్టెంబరు జరిగిన ఎదురుకాల్పుల్లోనే కర్నల్‌ మన్‌ప్రీత్, ముజమ్మిల్‌ భట్‌లతోపాటు వీరమరణం పొందారు. శాంతి సమయంలో ఇచ్చే మూడో అత్యున్నత గ్యాలంట్రీ అవార్డు- శౌర్యచక్ర.

1,037 పోలీసు పతకాలు

స్వాతంత్య్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం 1,037 మంది పోలీసు సిబ్బందికి సేవా పతకాలు ప్రకటించింది. ఇందులో 214 మందికి శౌర్య పతకాలు, 231 మందికి మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ దక్కనున్నాయి. కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్‌) సిబ్బందికి అత్యధికంగా 52 శౌర్య పతకాలు (శౌర్యచక్రలతో కలిపితే 57 గ్యాలంట్రీ పతకాలు) వచ్చాయి. జమ్మూకశ్మీర్‌ పోలీసులకు 31 మెడల్స్‌ దక్కాయి. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర పోలీసు సిబ్బంది 17 చొప్పున పతకాలు పొందారు. సీబీఐలో పనిచేస్తున్న 18 మందిని పోలీసు పతకాలు వరించాయి. మరోవైపు- రైల్వే పరిరక్షణ దళం (ఆర్‌పీఎఫ్‌), రైల్వే పరిరక్షణ ప్రత్యేక దళం (ఆర్‌పీఎస్‌ఎఫ్‌)లకు చెందిన 16 మంది సిబ్బందికి రాష్ట్రపతి డిస్టింగ్విష్‌డ్‌ సర్వీస్, మెరిటోరియస్‌ సర్వీస్‌ అవార్డులను ప్రకటించారు.