News

అల్లర్లపై యుద్ధ నేరాల ట్రైబ్యునల్‌లో విచారణ

32views

ఇటీవల బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చోటుచేసుకున్న అల్లర్లలో పలువురిని హతమార్చినవారిని ‘అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌-బంగ్లాదేశ్‌ (ఐసీటీ-బీడీ)’లో విచారించాలని తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. 1971లో బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధంలో పాకిస్థాన్‌ దళాలతో కలిసి నేరాలకు పాల్పడినవారిని విచారించడానికి దీనిని ఏర్పాటుచేశారు. హసీనాపై విద్యార్థులు చేపట్టిన ఉద్యమంలో 560 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. జులై ఒకటి నుంచి ఈ నెల 5 వరకు జరిగిన హత్యల్ని విచారణ కోసం పరిగణనలోకి తీసుకోనున్నట్లు ప్రభుత్వ న్యాయ సలహాదారుడు డాక్టర్‌ ఆసిఫ్‌ నజ్రుల్‌ విలేకరులకు తెలిపారు. ఊచకోతలో ప్రమేయమున్నవారిని, దానికి వివిధ రకాలుగా సహకరించినవారిని యుద్ధనేరాల న్యాయస్థానంలో నిలబెడతామని, ఏ ఒక్కరినీ వదిలేది లేదని స్పష్టంచేశారు. ఐరాస పర్యవేక్షణలో పూర్తి పారదర్శకత, నిష్పాక్షికతతో దర్యాప్తు జరిగేలా ప్రత్యేక బృందం కృషి చేస్తుందని చెప్పారు. తప్పుడు కేసుల్ని గురువారానికి ఉపసంహరిస్తామని తెలిపారు. పోలీసు కాల్పుల్లో కుమారుడిని కోల్పోయిన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ ప్రధాని హసీనాపై తొలిరోజే అంతర్జాతీయ ట్రైబ్యునల్‌లో కేసు నమోదైంది. ఆమెతోపాటు నలుగురు మంత్రులు, పలువురు పోలీసు ఉన్నతాధికారుల పేర్లనూ దీనిలో చేర్చారు. 2015లో ఒక న్యాయవాది అపహరణకు సంబంధించిన కేసులోనూ హసీనాను, మాజీ మంత్రుల్ని చేరుస్తూ పోలీసులు బుధవారం మరో కేసు నమోదు చేశారు.

భారత్‌తో పనిచేయడంపై ఆసక్తి

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకునేలా కలిసి పనిచేయడానికి బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం ఆసక్తితో ఉందని విదేశీ వ్యవహారాల సలహాదారుడు తౌహీద్‌ హుసేన్‌ చెప్పారు. భారత్‌ నుంచి హసీనా చేసిన ప్రకటన మాత్రం దీనికి తగ్గట్టుగా లేదని ఆక్షేపించారు. భారత హైకమిషనర్‌ ప్రణయ్‌వర్మ తనతో మర్యాదపూర్వకంగా భేటీఅయిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. తాత్కాలిక సారథి యూనుస్‌ బుధవారం తొలిసారిగా కొత్త ‘ఎక్స్‌’ ఖాతా నుంచి ఓ పోస్ట్‌ చేశారు. నిరసనకారులు ప్రాణాలు కోల్పోవడంపై దర్యాప్తు జరపడానికి ఐరాస నుంచి ప్రతినిధుల బృందం త్వరలో బంగ్లాదేశ్‌కు రాబోతోందని ఆయన తెలిపారు.

బంగ్లాదేశ్‌ పరిణామాల వెనుక తమ హస్తం ఉందన్న ఆరోపణలు అత్యంత హాస్యాస్పదమని అమెరికా మరోసారి ఖండించింది.