News

స్వాతంత్య్రోద్యమ వీరుడు బోనంగి పండు పడాల్‌

72views

( ఆగస్టు 13 – బోనంగి పండు పడాల్‌ జయంతి )

బ్రిటిష్‌ నిరంకుశ పాలనలో గిరిజనులు అనుభవిస్తున్న దయనీయ స్థితిని తొలగించి, వారి జీవితాలలో వికాస అభ్యుదయాలు కలిగించడానికి అల్లూరి సీతా రామరాజు మన్యంలో గొప్ప విప్లవం నడిపారు. దీనిలో పాల్గొన్న అల్లూరి అను చరులలో గంటన్న దొర, మల్లుదొరల తరువాత చెప్పుకోవలసిన వీరుడు బోనంగి పండు పడాల్‌. నేటి అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం గొందిపాకలులో 1890 ఆగస్టు 13న పడాల్‌ జన్మించారు. 22 ఏళ్ల వయస్సులో అదే గ్రామానికి చెందిన లింగాయమ్మతో వివాహమైంది. అప్పటికే బ్రిటిష్‌ పాలకుల దురాగతాలు పెచ్చు మీరిపోయాయి. దీంతో అల్లూరి సీతారామరాజుతో కలిసి సాయుధ పోరాటంలో భాగంగా పోలీస్‌ స్టేషన్లపై దాడుల్లో పాల్గొన్నారు.

ప్రధానంగా 1922 సెప్టెంబరులో కృష్ణాదేవిపేట వద్ద బ్రిటిష్‌ సైనికాధికారులు హైటర్, క్లవర్ట్‌లను అంతమొందించిన దాడిలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. దీంతో పోలీసుల హిట్‌లిస్ట్‌లో చేరడంతో, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అల్లూరి సీతారామరాజు మరణం అనంతరం బ్రిటిష్‌ ప్రభుత్వం పడాల్‌ వివరాలు, ఆచూకి తెలి పిన వారికి వంద రూపాయలు బహుమానం ప్రకటించింది. ఒక రోజు తన స్వగ్రామం వెళ్ళారు పడాల్‌. అప్ప టికే బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేస్తూ ఉంది. దీంతో పడాల్‌ సోదరి (ఆక్క) రామయమ్మ భోజనానికి ఇంటికి పిలిచి బ్రిటిష్‌ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు 1924 జూన్‌లో అరెస్టు చేశారు. విశాఖపట్నం సెషన్స్‌ కోర్టు 1925 మే 11న మరణ శిక్ష విధించింది. ఈ శిక్షను మళ్లీ యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.

రాజమండ్రి, కన్నూరు, తిరుచు రాపల్లి, పాయంకోట, మద్రాస్‌ జైళ్లలో ఉంచి… తర్వాత 1926లో అండమాన్‌లో ప్రవాస శిక్షకు పంపించారు. నాటి నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు శిక్షను అనుభవించారు. జైలు నుంచి విడుదలైన పడాల్‌ అండమాన్‌లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. విడుదలైన వెంటనే తహసీల్దార్‌ ద్వారా గొందిపాకలులో ఉన్న భార్య లింగాయమ్మను అండమాన్‌ రప్పించుకునేందుకు ప్రయత్నించినప్ప టికీ ఆమె నిరాకరించింది. దీంతో అండమాన్‌లో పార్వతి అనే మహిళను వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు 2012 ఫిబ్రవరి 29న గొందిపాకలులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఏటా ఆ గ్రామస్థులు పండు పడాల్‌ జయంతిని ఆగస్టు 13న ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటువంటి ఎందరో అమర వీరుల త్యాగ ఫలితమే ఇవ్వాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు!