News

ఎర్రకోటపై స్వాతంత్య్ర వేడుకలకు.. నిమ్మాడ రైతులకు ఆహ్వానం

45views

న్యూఢిల్లీలోని ఎర్రకోటపై ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలకు.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు చెందిన రైతులు దోమ మోహనరావు, పుణ్యవతి దంపతులకు ఆహ్వానం అందింది. మోహనరావు దంపతులు ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. సేంద్రియ ఎరువులను వినియోగించి.. యాంత్రీకరణ విధానం ద్వారా అధిక దిగుబడి సాధించారు. బిందుసేద్యం ద్వారా మెట్టు పంటలు పండించి ఉత్తమ రైతుగా గుర్తింపు పొందారు. సాగులో ఈ దంపతుల ప్రతిభను గుర్తిస్తూ.. పీఎం కిసాన్‌ పథకం కింద వారిద్దరినీ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఎంపిక చేసినట్టు స్థానిక వ్యవసాయాధికారి సువ్వారి గోవిందరావు తెలిపారు. వీరి ఎంపికపై జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, గోవిందరావుతోపాటు పలు రైతులు హర్షం వ్యక్తం చేశారు. కాగా.. రానున్న రోజుల్లో ఎరువులు, రసాయనాలు లేకుండా ఆర్గానిక్‌ పంటలు పండించేలా దృష్టి సారిస్తున్నానని రైతు మోహనరావు తెలిపారు. సఫలీకృతమైతే జిల్లావ్యాప్తంగా ఈ విధానంపై ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు.