News

నరుడి నుంచి నారాయణుడిగా…

38views

ఈ సృష్టిలో పూచిన పూవులన్నీ పరిమళాలు వెదజల్లలేవు. అన్ని గాలులు సుగంధాలను పంచలేవు. కురిసిన వానలన్నీ పంటల్ని ఇవ్వవు. అలాగే పుట్టిన ప్రతి మనిషి చరిత్రలో నిలబడలేడు. ఏ మనిషైనా చరిత్ర సృష్టించి కారణజన్ముడు కావాలంటే ప్రయత్నం, నిరంతర సాధన తప్పనిసరి. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నారు వేమన. నిరంతర అభ్యాసం ద్వారా మాత్రమే ఎలాంటి వాళ్లయినా అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలరు.

గంగను భువికందించిన భగీరథుడి చరిత్ర నిరంతర సాధనకు ఓ మంచి ఉదాహరణ. సగరులను తరింపజేయడానికి గంగను భువికి తీసుకురావాలని అంశుమంతుడు తపస్సు చేశాడు. సాధించలేకపోయాడు. అతడి కొడుకు దిలీపుడు సైతం గంగను సాధించలేకపోయాడు. ఆపై దిలీపుడి తనయుడు భగీరథుడు తపస్సు చేసి గంగను సాధించాడు. అందుకే సాధనని ఏనాడూ ఆపకూడదు. అంతులేని సాధన తపస్సుగా మారడంవల్లే ధృవుడు ఆచంద్రతారార్కం నిలిచి ఉత్తమ స్థానాన్ని చేరుకున్నాడు. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారి చిరస్మరణీయుడయ్యాడు.

ఏ సాధనలోనైనా తొలి అంశం సానుకూల దృక్పథం, నమ్మకం. దేన్నయినా సాధించగలననే దృఢమైన నమ్మకం మనిషిని విజయతీరాలకు చేరుస్తుంది. ఇంక కార్యసాధనలో ముందుకు సాగుతున్న సాధకుడికి ఒక్కొక్కప్పుడు అపజయాలు తప్పవు. అప్పుడు సాధకుడు తన ఓటమికి కారణాలు విశ్లేషించుకుని, సమయానుకూలమైన నిర్ణయాలతో ముందుకి ప్రయాణించాలి. మోడు నుంచి చిగురించిన మొక్కలా ఆశాభావంతో లక్ష్యాన్ని చేరుకోవాలి.

నిజానికి మనిషికి మనసే గొప్ప సాధనా కేంద్రం. ఇలాంటి మనస్సులో అప్పుడప్పుడు ఉద్రేకపూరితమైన ఆలోచనలు ఉత్పన్నమై మనసును అల్లకల్లోలం చేస్తుంటాయి. ఆ అస్థిరమైన మనసు కార్యసాధనకు ఆటంకమవుతుంది. భగవద్గీతలో అర్జునుడు అశాంతితో అల్లకల్లోలంగా ఉన్న మనసును నియంత్రించడం అసంభవం అన్న ప్రశ్నకి శ్రీకృష్ణుడు ‘ఓ అర్జునా! చంచలమైన మనస్సును అభ్యాస వైరాగ్యాల ద్వారా స్వాధీనం చేసుకోవచ్చు’ అని బోధించాడు.

అభ్యాసం వల్ల, పట్టుదల వల్ల అజ్ఞాని జ్ఞాని అవుతాడు. బోయవాడు వాల్మీకిగా మారటం, ఏకలవ్యుడు గొప్ప విలుకాడు కావడం దీనికి మంచి ఉదాహరణలుగా నిలుస్తాయి. అందుకే ఏదైనా సాధ్యం అనుకుని ప్రయత్నిస్తే విజయం తప్పక వరిస్తుంది. అభ్యాసం వల్ల ఏకాగ్రత, శ్రద్ధ పెరుగుతాయి. దేన్నయినా సాధించవచ్చనే నమ్మకం పెరుగుతుంది.అందుకే మనిషి ఏ కార్యాన్ని ప్రారంభించినా దాన్ని పూర్తిచే సేవరకు విశ్రమించకూడదు. నిరంతరం అదే ధ్యాసలో ఉండాలి. ఇది ఆధ్యాత్మికతకూ వర్తిస్తుంది. మనిషి తన జీవిత లక్ష్యాన్ని గ్రహించి తన సర్వశక్తులనూ ఆత్మజ్ఞానం పొందడానికి కృషి చేయాలి. అప్పుడే అతడు నరుడి నుంచి నారాయణుడిగా, పురుషుడి నుంచి పురుషోత్తముడిగా, ఓ మహాత్ముడిగా మారతాడు.