News

సత్యదేవుని దర్శనానికి ఆంక్షలు

47views

కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై సత్యదేవుని ప్రదక్షిణ ఓ ప్రహసనంలా మారింది. భక్తుల రద్దీని నియంత్రించే పేరుతో మధ్యాహ్నం మూడు గంటల తరువాత మాత్రమే ప్రదక్షిణ దర్శనానికి అనుమతిస్తున్నారు. రూ.300 టిక్కెట్‌తో రెండు నెలల క్రితం వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రదక్షిణ దర్శనానికి భక్తులను అనుమతించేవారు. టిక్కెట్ల విక్రయం ద్వారా రోజుకు రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు ఆదాయం వచ్చేది. ప్రతి నెలా రూ.80 లక్షల నుంచి రూ. కోటి వరకు ఈ దర్శనం టిక్కెట్ల ద్వారా వచ్చేది. ప్రస్తుతం ఈ ప్రదక్షిణ దర్శనంపై ఆంక్షలతో ఆ ఆదాయానికి భారీగా గండి పడింది.

ప్రస్తుతం అంతరాలయం దర్శనం పేరుతో రూ.200 టిక్కెట్‌ మీద లోపలకు పంపుతున్నా భక్తులు సంతృప్తి చెందడం లేదు. గతంలో రూ.300 టిక్కెట్‌తో ప్రదక్షిణ దర్శనం చేసుకునే భక్తుల్లో ఇప్పుడు సగం మంది కూడా రూ.200 టిక్కెట్‌తో అంతరాలయం దర్శనం చేసుకోవడం లేదు. దీనికి ప్రధాన కారణం ఉచిత దర్శనానికి అంతరాలయం దర్శనానికి పెద్ద తేడా లేకపోవడమే.కాగా, రెండు నెలల క్రితం ఆలయానికి వచ్చి రూ.300 టిక్కెట్లు తో గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ దర్శనం చేసుకున్న భక్తులు ఇప్పుడు మళ్లీ ఆలయానికి వచ్చినపుడు ప్రదక్షిణ దర్శనం ఎందుకు నిలిపివేశారని ప్రశ్నిస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆంక్షల వల్‌ ఆదాయం కోల్పోతున్న విషయం తెలిసినా అధికారుల మీద భయంతో ఎవరూ నోరు మెదపడం లేదు.

గత ఏడాది విజయదశమి నుంచి ప్రారంభమైన ప్రదక్షిణ దర్శనం
గత ఏడాది విజయదశమి నుంచి సత్యదేవుని ఆలయంలో గర్భాలయ దర్శనం ప్రారంభమైంది. అప్పటి ఈఓ ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ అజాద్‌ ఈ దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కోరిక మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త, దానవాయిపేటకు చెందిన హేచరీస్‌ అధినేత చినబాబు రూ.25 లక్షల వ్యయంతో ప్రదక్షిణ దర్శనం మార్గంలో నాలుగు దిక్కులా బంగారు పూత కలిగిన శ్రీగంధం గిన్నె, లక్ష్మీ హుండీ, కల్పవృక్షం, కామధేనువులను ఏర్పాటు చేశారు. భక్తులు వీటిని దర్శిస్తూ ప్రదక్షిణగా స్వామివారి అంతరాలయంలోకి ప్రవేశించి స్వామిని దర్శించుకునే వీలు కల్పించారు. ప్రస్తుతం ఈ దర్శనాలు నిలిపివేయడంతో అవి ఏర్పాటు చేసిన దాతల ఆశయం నెరవేరడం లేదు. దానికి తోడు ప్రదక్షిణ దర్శనం మార్గంలో ఏసీలు, ప్రత్యేక దీపాలు ఏర్పాటు చేయడంతో ఎంతసేపు ఆలయంలో ఉన్నా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడంతో ఈ దర్శనానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.

భక్తులు ఎవరూ లేని సమయంలో అనుమతి
సాధారణంగా సత్యదేవుని ఆలయంలో భక్తులు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటారు. ఆ తరువాత భక్తులు పెద్దగా ఉండరు. కానీ ప్రదక్షిణ దర్శనానికి మాత్రం మధ్యాహ్నం మూడు గంటల నుంచి మాత్రమే భక్తులను అనుమతించాలని ఈఓ కె.రామచంద్రమోహన్‌ ఆదేశించారు. కార్తీకమాసం, దశమి, ఏకాదశి, శనివారం వంటి రోజుల్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు ఉంటారు. అయితే ఆ రోజుల్లో అసలు ప్రత్యేక దర్శనానికి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో భక్తుల అసంతృప్తితో బాటు దేవుని ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇప్పటికై నా ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రదక్షిణ దర్శనానికి భక్తులను అనుమతించాలని కోరుతున్నారు.