News

మా దేశంలో సంక్షోభానికి కారణం అమెరికాయే: షేక్ హసీనా

50views

బంగ్లాదేశ్‌ సంక్షోభం వెనుక అమెరికా హస్తముందని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా ఆరోపించారు. సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తమకు అప్పగించాలన్న అమెరికా కోరికను తీర్చనందుకే అగ్రరాజ్యం ఈ కుట్రకు పాల్పడిందని ఆమె చెప్పుకొచ్చారు.

గతంలో పేరు చెప్పకుండా ఒక దేశం అంటూ ఆరోపణలు చేసిన హసీనా, తాజాగా ఒక భారతీయ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ అమెరికాపై వేలెత్తి చూపారు. వైమానిక స్థావరం పేరుతో అమెరికా అడుగుపెడితే అది అక్కడితో ఆగదని, ప్రాదేశిక రాజకీయాలను ప్రభావితం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తుందనీ హసీనా అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం భారతదేశంలో తలదాచుకున్న షేక్ హసీనా, అతివాదుల మాయలో పడొద్దని బంగ్లాదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. బంగాళాఖాతంలో స్థావరం కోసం అమెరికా తమ దేశాన్ని అతలాకుతలం చేసిందని మండిపడ్డారు. తనకు దేశమే ముఖ్యమని, అందుకే అమెరికా ప్రతిపాదనకు ఒప్పుకోలేదని చెప్పిన హసీనా, ఆ కారణం వల్లనే తన అధికారాన్ని సైతం వదులుకున్నానని చెప్పారు. తను దేశంలోనే ఉండి ఉంటే ఎంతోమంది ప్రాణాలు పోయేవని, ఎన్నో వనరులు ధ్వంసమయ్యేవనీ హసీనా చెప్పారు. అందుకే మనసుకు ఎంతో కష్టం కలిగినా, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయానన్నారు. త్వరలోనే మళ్ళీ స్వదేశానికి వెడతానని ధీమా వ్యక్తంచేసారు.

అవామీలీగ్ నాయకులు, కార్యకర్తలు చాలామందిని హత్య చేసారని తెలిసి హసీనా బాధపడ్డారు. పార్టీ ఈ కష్టకాలాన్ని దాటి మళ్ళీ నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.