News

బంగ్లాదేశ్ లో హిందువుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

103views

బంగ్లాదేశ్‌ లో మైనారిటీలపై దాడులను నిరసిస్తూ లక్షలాది మంది హిందువులు రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో లక్షలాది మంది హిందువులు పాల్గొన్నారు. రాజధాని ఢాకా, రెండో ప్రధాన నగరమైన చిట్టగాంగ్‌లో భారీగా నిరసనలు జరుగుతున్నాయి. ర్యాలీల్లో సుమారు 7 లక్షల మంది హిందువులు పాల్గొన్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.

మైనారిటీలను వేధించిన వారిపై దర్యాప్తును వేగవంతం చేయాలని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన హిందువులు, మైనారిటీలకు 10 శాతం పార్లమెంటు స్థానాలు కేటాయించాలని కోరారు. అలాగే మైనారిటీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలన్నారు.

మైనారిటీల ఆందోళనకు విద్యార్థులతో పాటు ముస్లిం నిరసనకారులు కూడా సంఘీభావం తెలిపారు. భారీ ర్యాలీ కారణంగా ఢాకా నగరంలో 3 గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. అమెరికా, యూకేలలో కూడా ఇదే తరహా నిరసన ర్యాలీలు జరిగాయి.

షేక్ హసీనా నాయకత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ నిరసనల్లో భాగంగా పలువురు హిందువుల నివాసాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. మైనారిటీ లపై 205 కంటే ఎక్కువ దాడులు జరిగాయి. ఇద్దరు హిందూ నాయకులు చనిపోయారు. దేవాలయాలు కూడా ధ్వంసమయ్యాయి.

మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారధి ముహమ్మద్ యూనస్ ఖండించారు. హిందూ, క్రిస్టియన్, బౌద్ధ కుటుంబాలను దాడుల నుంచి రక్షించాలని పిలుపునిచ్చారు.