News

పురాతన ఆలయాలు దెబ్బతినకుండా మెట్రో పనులు చేయండి : మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు

57views

చెన్నై మెట్రోరైల్ విభాగానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మెట్రోరైలు రెండోదశ నిర్మాణ పనుల కోసం థౌజండ్ లైట్స్ ప్రాంతంలోని రాయపేట వైట్స్ సాలైలో వున్న పురాతన శ్రీ రత్న వినాయగర్, దుర్గయమ్మన్ ఆలయ గోపురాలు కూల్చేసేందుకు మెట్రో అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిని వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మెట్రోరైలు పనుల కోసం పురాతనమైన ఆలయ రాజగోపురాన్ని 5 మీటర్లు లోపలికి తరలించి, పనులు పూర్తైన తర్వాత అదే ప్రాంతంలో ఏర్పాటు చేసి, కుంభాభిషేకం కూడా నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో పనుల వల్ల రాజగోపురం కచ్చితంగా ప్రభావితం అవుతుందని, ఆధునిక సాంకేతికతతో 5 మీటర్లు లోపలికి తరలించి, పనులు పూర్తైన తర్వాత మళ్లీ అదే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. రత్న వినాయగర్ ఆలయాన్ని కూల్చేసే పరిస్థితే వస్తే.. పనులు పూర్తయ్యాక అక్కడే గుడి ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత కుంభాభిషేకం కూడా నిర్వహించాలని ఉత్తర్వులిచ్చింది.
మెట్రో రైలు విస్తరణలో భాగంగా పురాతన ఆలయ గోపురాలను కూల్చేయాలంటూ మెట్రో అధికారులు చర్యలు చేపట్టడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ఇంచార్జి చీఫ్ జస్టిస్ కృష్ణకుమార్, జస్టిస్ కుమరేశ్ బాబు ధర్మాసనంలో పెండింగ్ లో వుంది. అనంతరం హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆలయాలకు, గోపురాలకు ఎలాంటి నష్టం జరగకుండా మెట్రో పనులు పూర్తి చేయవచ్చా? లేదా? అన్న విషయంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుమరేశ్ బాబు నేరుగా వెళ్లి, పరిశీలించి, నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ తాజాగా మళ్లీ విచారణకు వచ్చింది.