News

మథురలో మసీదు కాంప్లెక్స్‌ సర్వేపై స్టే పొడిగింపు: సుప్రీంకోర్టు

35views

మథురలోని షాహీ ఈద్గా మసీదు ప్రాంగణం, పక్కనే ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి ఆలయంపై కోర్టు పర్యవేక్షణలో సర్వే జరగాలన్న అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వుపై విధించిన స్టేని సుప్రీంకోర్టు.. నవంబరు వరకూ పొడిగించింది. ఈ మేరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. మసీదు కాంప్లెక్స్‌పై సర్వే కోసం గత ఏడాది డిసెంబరు 14న హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీన్ని పర్యవేక్షించడానికి ఒక కోర్టు కమిషనర్‌ను నియమిస్తామని తెలిపింది. ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 16న స్టే విధించింది. తాజాగా దాన్ని పొడిగించింది. అంతకుముందు సర్వోన్నత న్యాయస్థానంలో హిందువుల తరఫున న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ వాదనలు వినిపిస్తూ.. కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంపై దాఖలైన 18 కేసుల విచారణయోగ్యతను సవాల్‌ చేస్తూ ముస్లిం పక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 1న హైకోర్టు కొట్టేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబరు 14 నాటి ఉత్తర్వులు, సంబంధిత ఇతర ఆదేశాలకు వ్యతిరేకంగా షాహీ మసీదు దాఖలు చేసిన అపీళ్లు నిష్ప్రయోజనంగా మారాయని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. జనవరి 16న విధించిన స్టేను ఎత్తివేయాలన్న వినతి కూడా దాఖలైందని పేర్కొంది. అన్ని అంశాలపై నవంబరులో విచారణ జరుపుతామని తెలిపింది.