News

బంగ్లాదేశ్ హిందువులను కాపాడాల్సిన బాధ్యత ప్రపంచంపై వుంది : తమిళనాడు విశ్వహిందూ పరిషత్

53views

పొరుగున వున్న బంగ్లాదేశ్ లో హిందువుల దయనీయ పరిస్థితిపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల చేత ఎన్నికైన ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచిపెట్టిన తర్వాత అరాచకవాద శక్తులు విజృంభించాయని, ఆధిపత్యం చెలయిస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ తమిళనాడు క్షేత్ర సంఘటనా మంత్రి ఆకారపు కేశవ రాజు మండిపడ్డారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. బంగ్లాలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, అతివాద జిహాదీ శక్తులు హిందూ సమాజాన్ని అణచివేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా బంగ్లాలో హిందువుల దేవాలయాలు, వ్యాపార సంస్థలు, ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని, బంగ్లాలోని ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి వుందని ఆందోళన వ్యక్తం చేశారు.

శ్మశాన వాటికలను కూడా ముస్లిం ఛాందసులు విడిచిపెట్టడం లేదని, హిందూ ఆలయాలు బాగా దెబ్బతిన్నాయని, అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి అని అన్నారు. విభజన సమయంలో బంగ్లాలో హిందువుల జనాభా 32 శాతం వుండేదని, ఇప్పుడు అది 8 శాతానికి పడిపోయిందని, జిహాదీ శక్తులు హిందువులను నిరంతరం అణచివేస్తున్నాయని అన్నారు.ఈ సమయంలో హిందువుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు. బంగ్లాలోని హిందువులను కాపాడే బాధ్యత యావత్ ప్రపంచ సమాజంపై వుందని, వారి హక్కులను కాపాడాల్సిన అవసరం వుందన్నారు. బంగ్లా దేశ్ హిందువులను ఆదుకోవడంలో భారత ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే.. ఇదే అణువుగా జిహాదీలు సరిహద్దులు దాటి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేయవచ్చని, ఈ విషయంలో జాగ్రత్తగా వుండాలని ఆయన సూచించారు. వీలైనంత త్వరగా బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య లౌకిక ప్రభుత్వం మళ్లీ నెలకొనాలన్నదే తమ తాపత్రయమని, బంగ్లా ఆర్థికాభివృద్ధికి కూడా ఆటంకం లేని పరిస్థితులు నిర్మాణం కావాలని ఆకారపు కేశవ రాజు ఆకాంక్షించారు.