News

రంజిత్ సింగ్ స్వర్ణ సింహాసనం భారత్ కు రావాలి

40views

సిక్కు యోధుడు, ఆధునిక భారతదేశ చరిత్రలో సమున్నత స్థానం కలిగిన మహారాజా రంజిత్ సింగ్. ఆయన ఉపయోగించిన స్వర్ణ సింహాసనం ఇంగ్లండ్లో ఉంది. దానిని తిరిగి దేశానికి రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా కోరారు. జూలై 24న ఆయన ఎగువ సభలో ప్రత్యేక ప్రస్తావనగా ఈ అంశాన్ని తీసుకు వచ్చారు. 19వ శతాబ్దానికి చెందిన మహారాజా రంజిత్ సింగ్ కోసం హఫీజ్ మహ్మద్ ముల్తానీ అనే స్వర్ణకారుడు 1805-1810 మధ్య ఈ సింహాసనం తయారు చేశాడు. నిజానికి ఇది రంజిత్ సింగ్ దర్బార్ వైభవాన్ని చాటి చెబుతుంది. యూరోప్ వస్తువుల మాదిరిగా కాకుండా, రెండు కమల ఆకృతులతో ఈ సింహాసం చెక్కారు. దానికి పైన దళసరి బంగారు రేకును తాపడం చేశారు.

1849లో ఈస్టిండియా కంపెనీ పంజాబ్ ను ఆక్రమించినప్పుడు ఈ సింహాసనాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ స్వర్ణ సింహాసనమే కాదు, ఇంకా రంజిత్ సింగ్ ఆస్థానంలోని విలువైన ఆభరణాలు, ఖజానా కూడా దోచేశారు. ఇందులో సింహాసనం మాత్రం లండన్లోని లీడెన్లు స్ట్రీట్లోని ఈస్టిండియా కంపెనీ వస్తు ప్రదర్శనశాలకు తరలించి, ప్రదర్శనకు పెట్టారు. మిగిలిన వస్తువులు లాహోర్లో వేలం వేశారు. 1879లో కంపెనీ మ్యూజియంను ఎత్తివేసిన తరువాత ఆ సింహాసనం సౌత్ కెన్సింగ్ట న్ మ్యూజియంకు తరలించారు. దానినే ఇప్పుడు విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజియం అంటున్నారు. ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో నాడు రంజిత్ సింగ్ అందించిన పాలనకు చరిత్రలో ఎంతో స్థానం ఉందని చద్దా ఈ సందర్భంగా సభ దృష్టికి తెచ్చారు. సమన్యాయం, సెక్యులర్ భావాలతో ఆయన పాలించాడని అన్నారు. ప్రస్తుతం విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజియంలో ఉన్న రంజిత్సింగ్ సింహానం భారత్కు తిరిగి తేవడానికి ఇంగ్లండ్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని చద్దా కేంద్రానికి సూచించారు. ఆ చారిత్రక వైభవాన్ని సూచించే ఆ సింహాసనాన్ని అన్ని దౌత్య మార్గాలను ఉపయోగించుకుని తీసుకురావాలని చద్దా కోరారు.