News

బంగ్లాదేశ్ హిందువుల రక్షణకు చర్యలు తీసుకోండి: కేంద్రాన్ని కోరిన ఆరెస్సెస్

43views

బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసా కాండ, హిందువులపై ముస్లిం మూకలు చేస్తున్న దాడులపై ఆరెస్సెస్ స్పందించింది. బంగ్లాలో పరిస్థితి దిగజారుతోందని, అక్కడి హిందువులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుందన్న నమ్మకం తమకుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ అఖిల భారత కార్యకారిణి సదస్యులు భయ్యాజీ జోషి వెల్లడించారు. అయితే ఇప్పటికే కేంద్రానికి తమ అభ్యర్థనను పంపామన్నారు. నిజానికి బంగ్లాదేశ్ వేరే దేశమని, అయినా… సంఘటిత కార్యంలో వున్నాం కాబట్టి చూడాల్సిన బాధ్యత వుందన్నారు. బంగ్లాలో హిందువులే టార్గెట్ గా దాడులు చేస్తున్నారని, హిందూ దేవాలయపై దాడులు చేస్తున్నారన్న వార్తలు కూడా వింటున్నామని పేర్కొన్నారు.

ఇక ఇదే విషయంపై విశ్వహిందూ పరిషత్ కూడా స్పందించింది. బంగ్లాదేశ్‌లోని మైనారిటీల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) భారత ప్రభుత్వాన్ని కోరింది. మన పొరుగు దేశం బంగ్లాదేశ్ విచిత్రమైన అనిశ్చితి, హింస, అరాచకంలో చిక్కుకుందని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా అణగారిన వర్గాలకు సంప్రదాయబద్ధంగా సాయం చేస్తున్న భారత్ ఈ పరిస్థితిలో కళ్లుమూసుకోలేమని ఆయన స్పష్టం చేశారు.

హసీనా ప్రభుత్వం రాజీనామా చేసి ఆమె దేశం విడిచిపెట్టిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని, ఈ సంక్షోభ సమయంలో, బంగ్లాదేశ్‌లోని మొత్తం సమాజానికి మిత్రుడిగా భారత్ దృఢంగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో హిందువులు, సిక్కులు, ఇతర మైనారిటీల మతపరమైన స్థలాలు, వ్యాపార సంస్థలు, ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయని అలోక్ కుమార్ తెలిపారు.