News

యుపిలో మతమార్పిడి వ్యతిరేక చట్టం బలోపేతాన్ని స్వాగతించిన విహెచ్‌పి

56views

ఉత్తరప్రదేశ్‌లో 2019లో రూపొందించిన మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరింత బలోపేతం చేయడాన్ని విశ్వహిందూ పరిషద్ స్వాగతించింది. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అటువంటి చర్యలు తీసుకోవాలని విహెచ్‌పి నేత మిలింద్ పరాందే పిలుపునిచ్చారు.

‘‘మతమార్పిడి వ్యతిరేక చట్టం అమల్లో ఉన్నప్పటికీ లవ్‌జిహాద్, అక్రమ మతమార్పిడులు జరుగుతూనే ఉన్నాయి. చట్టవ్యతిరేక మతమార్పిడుల నిషేధం సవరణ బిల్లు 2024ను ఉత్తరప్రదేశ్ శాసనసభ ఆమోదించడం మంచి పరిణామం. దానివల్ల వ్యవస్థీకృత నేరగాళ్ళు మాత్రమే కాక ఇతర జిహాదీలు, మిషనరీలు కూడా తమ తప్పుడు పనుల ఫలితాల గురించి భయపడతారు’’ అని విహెచ్‌పి ప్రధానకార్యదర్శి మిలింద్ పరాందే అన్నారు.

యూపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులోని అంశాలను ఆయన అభినందించారు. ఫిర్యాదిదారుల విస్తృతిని పెంచడం, శిక్షల్లో జీవితఖైదును చేర్చడం, జరిమానాలను పెంచడం, మైనర్ పిల్లలు, దివ్యాంగుల హక్కుల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వంటి చర్యల ద్వారా నేరమనస్కుల్లో భయం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. రాముడు, కృష్ణుడు, శివుడు నడయాడిన నేలను మతమార్పిడి చేయాలన్న అజెండాతో పనిచేసేవారి నుంచి విముక్తం చేసే క్రమంలో ఈ చట్టం ఒక మైలురాయి కాగలదన్నారు.

దేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్యపు అమృత మహోత్సవాలు జరుపుకుంటుంటే కేవలం పది రాష్ట్రాలు మాత్రమే మతమార్పిడి వ్యతిరేక చట్టాలు చేయడం బాధాకరమని మిలింద్ అన్నారు. ‘‘మిగిలిన రాష్ట్రాలు కూడా తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి, అక్రమ మతమార్పిడులను నిలువరించాలి, ఆమేరకు కఠినమైన చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. మతమార్పిడి ముఠాల పట్ల ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలనీ, అటువంటి నేరస్తులకు శిక్షలు పడేలా అధికారులకు సహకరించాలనీ విజ్ఞప్తి చేసారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘చట్టవ్యతిరేక మతమార్పిడుల నిషేధ సవరణ బిల్లు 2024’ను జులై 29న రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టింది. 2021లో చేసిన చట్టానికి పలు సవరణలను చేసిన ఆ బిల్లును జులై 30న ఆమోదించింది.