News

పురాతన ఆలయాన్ని సందర్శించిన అధికారులు

48views

తిరుపతి జిల్లాలోని వాకాడు మండలం, తిరుమూరు గ్రామంలో చెట్ల పొదల్లో శిథిలావస్థలో బయటపడిన విష్ణు ఆలయాన్ని మంగళవారం పురావస్తుశాఖ అధికారులు పరిశీలించారు. పురావస్తుశాఖ ఏడీ శివకుమార్‌, చరిత్ర కారుడు స్థపతి, ప్రభుత్వ కళాశాల ప్రొఫెసర్స్‌ గోవిందుసురేంద్ర, వినోద్‌, దేవదాయశాఖ అధికారి శశాంక్‌ తదితరులు ఆలయాన్ని సందర్శించి, ఆలయ చరిత్రను అంచనా వేశారు. గోవిందుసురేంద్ర మాట్లాడుతూ స్థానికుల ఆహ్వానంతోపాటు మైసూర్‌ పురావస్తుశాఖ అధికారి మునిరత్నంరెడ్డి ఆదేశాలతో ఆలయాన్ని సందర్శించినట్టు తెలిపారు. ఈ ఆలయాన్ని చూస్తే చోళుల నాటి కట్టడాలుగా, మంచి చరిత్ర ఉన్న ఆలయంగా తెలుస్తోందన్నారు. ఒకప్పుడు తిరుమూరు వర్తక వాణిజ్య కేంద్రంగా ఉన్నట్లు చరిత్రద్వారా తెలుస్తోందని, అలాగే తీర ప్రాంతంలో చాలా ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాలను అభివృద్ధి చేసి గత వైభవాలను భవిష్యత్‌ తరాలకు తెలియజేయాలని సూచించారు.