News

‘లవ్ జిహాద్’ నేరస్తులకు జీవిత ఖైదు: యూపీ అసెంబ్లీలో బిల్లు

56views

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘లవ్ జిహాద్’ కేసులపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. ఆ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. యూపీ అసెంబ్లీలో ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడుల నిషేధ బిల్లు 2024ను ప్రవేశపెట్టింది. ఆ బిల్లులో, లవ్‌ జిహాద్ నేరానికి పాల్పడిన నేరస్తులకు జీవితఖైదు విధించాలని ప్రతిపాదించింది. ఇంకా, చట్టవిరుద్ధమైన మతమార్పిడులకు నిధులు సమకూర్చడాన్ని నేరంగా పరిగణించాలని కూడా ప్రతిపాదించింది. ఆ బిల్లును జులై 29 సోమవారం యూపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడుల నిషేధ చట్టం 2021 ప్రకారం ఆ నేరాలకు ఏడాది నుంచి పదేళ్ళ వరకూ శిక్షలున్నాయి. కేవలం పెళ్ళి కోసమే మతం మారితే అలాంటి చర్య చెల్లదని ఆ చట్టం చెబుతుంది. అబద్ధాలు చెప్పి, లేదా మోసగించి మతం మార్చడాన్ని నేరచర్యలుగా పరిగణిస్తుంది. కొత్త బిల్లు అవే అంశాలను మరింత దృఢంగా ప్రకటిస్తుంది. ‘లవ్ జిహాద్’కు పాల్పడినట్లు ఋజువైన నేరస్తులకు జీవితకాల ఖైదు విధించాలని తాజా బిల్లు ప్రతిపాదించింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం బలవంతపు, లేదా మోసపూరిత మతమార్పిడి నేరానికి పాల్పడితే ఒకటి నుంచి ఐదేళ్ళ జైలుశిక్ష, రూ.15వేల జరిమానా ఉన్నాయి. మైనర్లు, మహిళలు, ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారిని మతం మారిస్తే మూడు నుంచి పదేళ్ళ జైలుశిక్ష, రూ. 25వేల జరిమానా విధిస్తారు.

మతమార్పిడులు చేయాలనుకునే వారు ఆ విషయాన్ని రెండునెలలు ముందుగా జిల్లా కలెక్టర్‌కు నిర్దిష్ట ఫారంలో నోటిఫై చేయడం తప్పనిసరి. అలా చేయకపోతే ఆరు నెలల నుంచి 3ఏళ్ళ వరకూ జైలుశిక్ష, కనీసం రూ.10వేల జరిమానా విధిస్తారు.

ఆ బిల్లును సమర్ధించుకుంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే రాష్ట్రంలోని బలహీన వ్యక్తులు, ప్రత్యేకించి మహిళలను బలవంతంగా లేదా మోసపూరితంగా మతమార్పిడి చేయడం నుంచి వారిని రక్షించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. ఈ కొత్త ప్రతిపాదనలు ఏ నిర్దిష్ట మతం లేదా కులం పట్ల వివక్ష చూపించడం లేదని, అన్ని మతాల వారికీ సమానంగా వర్తిస్తాయనీ స్పష్టంగా వివరించింది.