ArticlesNews

మసీదులైన మందిరాలు

71views

అదంతా లాంఛనమని ప్రపంచానికి తెలుసు. ఎన్ని సర్వేలు చేసినా వెలుగు చూసేది ఆ ఒక్క వాస్తవేమనని తెలుసు. అది తిరుగులేని చారిత్రక సత్యమేనని తెలుసు. భారతభూమిలోని వేలాది హిందూ దేవాలయాలు ముస్లిం దురాక్రమణదారుల మతోన్మాదంతో అపవిత్రమైనాయని, ధ్వంసమైపోయాయని చరిత్ర ఘోషిస్తున్న సంగతీ తెలుసు. మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల ‘కట్టడం’ గురించి వెల్లడైనది అలాంటి మరొక సత్యమే. ధార్‌ అనే చోట ఇది ఉంది. ధార్‌ ఒకప్పటి సంస్థానం. భోజ్‌శాల ఆలయం`కమాల్‌ మౌలానా మసీదు అంటూ పిలుస్తున్న ఈ కట్టడం అంతకు ముందే ఉన్న హిందూ దేవాలయం మీద నిర్మించినదేనని భారత పురావస్తు పరిశోధన శాఖ (ఏఎస్‌ఐ) తేల్చి చెప్పింది. మార్చి 22, 2024`జూన్‌ 30, 2024 వరకు ఆ ఆలయం`మసీదు ప్రాంగణంలో జరిపిన సర్వే చాటిన వాస్తవమిదే. ఈ మేరకు 150 పేజీల నివేదికను ఇందోర్‌లోని ఎంపీ హైకోర్టు ధర్మాసనానికి జూలై 15న సమర్పించింది. ఇప్పుడున్న మసీదు హిందూ దేవాలయం శిథిలాల మీదే నిర్మించారు. అంతకు ముందు అక్కడ ఉన్నది హిందూ దేవాలయమేనని ఎలాంటి శషభిషలు లేకుండానే లోకానికి వెల్లడిరచింది. ఈ నివేదిక రూపొందించినది ఏఎస్‌ఐ అయినా, సమర్పించినది హైకోర్టుకే అయినా యథాప్రకారం ముస్లిం మత పెద్దలకు ఆగ్రహం వచ్చింది. పనిలో పనిగా ఉదారవాదులకి పూనకం వచ్చింది.

భోజ్‌శాలను తిరిగి సాధించుకోవడానికి హిందువులు పెద్ద పోరాటమే ఆరంభించవలసి వచ్చింది. ఎప్పుడో 1552లో ఆరంభమైంది. మొగలులు, ఆంగ్లేయులు, స్వతంత్ర భారతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు హిందువులను చాలా హింసించారు. కాంగ్రెస్‌ హయాంలో వివక్ష సుస్పష్టం. అయినా సాధారణ హిందువులు ఆరంభించిన ఈ ఉద్యమం పాక్షికంగానే అయినా ఇప్పటికి విజయం సాధించింది. ప్రాంగణంలోకి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిషేధించిన ప్రవేశహక్కును తిరిగి సాధించుకున్నారు. ఇక్కడి అమ్మవారి విగ్రహాన్ని బెంగాల్‌ విభజన కుట్రదారు కర్జన్‌ ఇంగ్లండ్‌ తరలించాడు. ఇప్పుడు న్యాయపోరాటం ద్వారా హిందువులు భోజ్‌శాలమీద కాషాయ జెండా ఎగురవేసే ప్రయత్నంలో ఉన్నారు. తమవైన ప్రార్థనా స్థలాల కోసం, పురాణ ప్రశస్తి కలిగిన పుణ్యతీర్ధాల కోసం హిందువులు ఆరంభించిన న్యాయపోరాటాలు అయోధ్యతోనే ఆగిపోలేదు. దేశంలో పలుచోట్ల కొత్త పోరాటాలు జరుగుతున్నాయి. కొందరి వాదన ప్రకారం ముస్లింల పాలనలో 60,000 హిందూ దేవాలయాలు ధ్వంసమైనాయి. ఇంకొందరి వాదన ప్రకారం 30,000 నుంచి 40,000 హిందూ దేవాలయాలు ముస్లిం మతోన్మాద కరవాలానికి ఛిద్రమయ్యాయి. వీటిలో ప్రతి ఒక్క హిందూ దేవాలయం మాకు పవిత్రమైనదేనని కొన్ని హిందూ సంఘాలు గర్జిస్తున్నాయి. వీటి కోసమే ఇప్పుడు న్యాయపోరాటం ఆరంభమైంది. ఒకదాని తరువాత ఒకటిగా వీటిని స్వాధీనం చేసుకోవాలన్నదే హిందూ సంఘాల ఆశయం.

సర్వే సాక్షిగా అది వాగ్దేవి ఆలయం

భోజ్‌శాల పేరుతో ప్రసిద్దమైన ధార్‌లోని ఆ కట్టడం ఒకప్పటి హిందూ ఆలయం, అంటే సరస్వతి అమ్మవారి ఆలయం. కాబట్టి అక్కడ ముస్లింల నమాజ్‌ను నిషేధించాలని హిందువులు న్యాయ స్థానాన్ని కోరుతున్నారు. ఈ మేరకు హిందూ సంఘాలు దాఖలు చేసిన వ్యాజ్యంతో మధ్యప్రదేశ్‌ హైకోర్టు సర్వే జరపవలసిందిగా మార్చి 11, 2024న ఏఎస్‌ఐని ఆదేశించింది. సర్వేలో నిగ్గు తేలిన నిజాలన్నీ పొల్లుపోకుండా హిందువులు చెబుతున్నదానికీ, వాదిస్తున్న దానికీ అనుగుణంగానే ఉన్నాయి.ఆ సర్వే ప్రకారం ఈ ప్రాంగణంలో 94 గ్రంథాలు దొరికాయి. 106 స్తంభాలు, 82 పిలాస్టర్లు, 31 పునాతన నాణేలు, 150 శాసనాలు బయటపడ్డాయి. వినాయకుడు, బ్రహ్మదేవుడు దేవేరులతో కలసి ఉన్న ప్రతిమలు దొరికాయి. నరసింహ, భైరవ మూర్తులు కూడా బయటపడ్డాయి. ఈ ఆధారాలను బట్టి ఇది పూర్వం సరస్వతీ అమ్మవారి కోసం లేదా చారిత్రకంగా ప్రసిద్ధమైన వాగ్దేవి కోసం నిర్మించిన ఆలయం కావచ్చునని ఏఎస్‌ఐ వెల్లడిరచింది. ఇది సరస్వతీ అమ్మవారి ఆలయమేనని చిరకాలంగా ధార్‌ ప్రాంతం లేదా మాల్వా ప్రాంత హిందువులు విశ్వసిస్తున్నారు.

నివేదిక ఇంకా ఇలా చెప్పింది. శాస్త్రీయ పరిశోధనలు, సర్వే, పురావస్తు తవ్వకాలు, జరిపిన అధ్యయనం, విశ్లేషణ, తవ్వకాలలో బయల్పడిన శిథిలాలు, శిల్పాలు, శాసనాలు, వాస్తు, శైలి, శిల్పశైలిలను బట్టి ఇప్పుడు ఉన్న కట్టడం పూర్వం ఉన్న వేరొక కట్టడం మీద నిర్మించినదేనని చెప్పగలమని కోర్టుకు సమర్పించిన ఏఎస్‌ఐ నివేదిక వెల్లడిరచింది. ఇందుకు సంబంధించిన కొన్ని బలమైన ఆధారాలు కూడా ఏఎస్‌ఐ కోర్టు ముందు ఉంచింది. మొదట ఉన్న ఒక రాతి కట్టడం పైననే ఇప్పుడున్న రాతి కట్టడాన్ని మలిచారని, దానినే మసీదుగా మార్చారని దొరికిన శిలాశాసనాల భాగాలు, శిథిలశిల్పాలు, వాస్తుజాడలను బట్టి చెప్పవచ్చునని నివేదిక స్పష్టం చేసింది. మొదటి కట్టడం 11వ శతాబ్దానికి చెందినదనీ, దాని మీదనే ప్రస్తుత కట్టడాన్ని నిర్మించారనీ, ఇది 14వ శతాబ్దానికి చెందినదనీ నివేదికలో తెలియచేశారు. కొత్త కట్టడం ఆదరబాదరా నిర్మించినదేనని తేలింది. పాత కట్టడంలోని కొంత పాలరాయిని, కొంత సున్నపు రాయిని కొత్త కట్టడం కోసం ఉపయోగించారు.

హిందూ ప్రతీకలు, చారిత్రక ఆధారాలు

హిందూధార్మిక గ్రంథాలలో, శిల్పాలలో కనిపించే సింహం, ఏనుగు, గుర్రం, కుక్క, కోతి, పాము, తాబేలు, హంస, పక్షి బొమ్మలు కూడా లోపల కనిపించాయి. ఒక రాయి మీద కూర్మావతారం కనిపించింది. విష్ణువు గురించి ప్రాకృత భాషలో ప్రస్తావించే పంక్తులు చెక్కారు. రెండు సర్పబంధ శాసనాలు దొరికాయి. వాటిలో ఒక దాని మీద సంస్కృత శ్లోకం ఉంది. ఈ శాసనాలు 11,12 శతాబ్దాలకు చెందినవి. అనుష్టుప్‌ ఛందస్సులో రాసిన మరొక రెండు శ్లోకాలు కూడా రాళ్ల మీద దొరికాయి. అందులో ఒకటి భోజుడి వారసులు ఉదయాదిత్య, నరవరమాన్‌లను కీర్తించింది. కాబట్టి ఇది నిస్సందేహంగా భోజుడు నిర్మించగా, ఆయన వారసులు పోషించిన విద్యా సంస్థ, అదే ఆలయం కూడా. మొదట ఇది ఆలయంగానే ఉండేది. ఈ సంగతిని మదన్‌ అనే కవి తన నాటకంలో ప్రస్తావించాడు. ఆయన వర్ణించిన సరస్వతి మాత విగ్రహమే ఇప్పుడు లండన్‌ మ్యూజియంలో ఉంది. అచ్చం అలాగే ఉండే మరొక శిల్పాన్ని చెక్కి అక్కడ ప్రతిష్ఠించారు. శివపురాణం ప్రస్తావించే కీర్తిముఖం కూడా ఈ ప్రాంగణంలో లభ్యమైంది. దక్షిణపు గోడ, పశ్చిమ ప్రాంతంలోని నిర్మాణం మీద అనేక చిన్న చిన్న బొమ్మలు యథాతథంగానే ఉన్నాయి. మనుషుల బొమ్మలు లేదా జంతువుల బొమ్మలు మసీదుల మీద నిషేధం. స్తంభాలు, గోడల మీద కొన్ని ఆకృతులను ధ్వంసం చేశారు. ఖిల్జీ వంశీకుడు ఒకటో మహ్మద్‌ షా (1455) స్మారక కట్టడం (ధార్‌లోనే) మీద అబ్దుల్లా షా ఛంగాల్‌ వేయించిన శాసనం ప్రకారం తమ మనుషులు కొందరు అక్కడి ప్రార్థనాలయాన్ని ధ్వంసం చేసి మసీదుగా మార్చారు. ఈ కట్టడం గురించి ఆ శాసనంలో చేసిన వర్ణన కూడా సరిపోలుతున్నది.

ఈ నివేదిక పట్ల హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కాశీ, అయోధ్యల మాదిరిగానే భోజ్‌శాల కూడా తన పూర్వపు అస్తిత్వాన్ని తిరిగి చాటుకుంటుందని తమకు తెలుసునని హిందూ ఫర్‌ జస్టిస్‌ సంస్థ సభ్యుడు ఆశిష్‌ గోయెల్‌ అన్నారు. కానీ ముస్లిం సంఘాలు మాత్రం, అప్పుడే ఏమైంది? దీని మీద తుది నిర్ణయం తీసుకోవలసినది సుప్రీంకోర్టు మాత్రమే అంటున్నాయి.