News

‘ఉనికి కాపాడుకునేందుకే విషం చిమ్ముడు’

56views

సీపీఎం ఎంపీ సచ్చిదానందం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దక్షిణ భారత ప్రచార ప్రముఖ్ శ్రీరామ్ హెచ్చరించారు. గత 99 ఏళ్లుగా సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధనం, పర్యావరణ సంరక్షణ, నాగరిక కర్తవ్యం, సమాజ, దేశ సేవకు ఆర్.ఎస్.ఎస్. అంకితమైందని..అటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని శ్రీరామ్ తేల్చి చెప్పారు. మహాత్మా గాంధీ హత్యతో ఆర్.ఎస్.ఎస్.కు సంబంధం ఉందని సీపీఎం ఎంపీ. సచ్చిదానందం ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎంపీ చేసిన వ్యాఖ్యలను శ్రీరామ్ ఈ సందర్భంగా ఖండించారు.

మహాత్మాగాంధీ హత్యతో సంఘ్‌ను ముడిపెట్టి సీపీఎం ఎంపీ నిరాధార ఆరోపణలు చేశారని శ్రీరామ్ మండిపడ్డారు. 1948లో గాంధీ హత్యకు గురైనప్పుడు ఆర్.ఎస్.ఎస్.‌ను తొలుత నిషేధించారని అయితే హత్యతో సంఘ్‌కి ఎలాంటి ప్రమేయం లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. సుప్రీం తీర్పుతో నిషేధాన్ని ఎత్తివేశారని ఆయన చెప్పారు. 1934లో గాంధీజీ మహారాష్ట్రలోని వార్ధా శిబిరాన్ని సందర్శించి సంఘ్ పనిని అభినందించారని, అలాగే భారత్-చైనా యుద్ధం అనంతరం సంఘ్ చేసిన సేవను గుర్తిస్తూ నాటి రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొనేందుకు ఆర్.ఎస్.ఎస్.‌ను అప్పటి ప్రధాని నెహ్రూ ఆహ్వానించారని గుర్తు చేశారు.

ఆర్.ఎస్.ఎస్. కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా జారీ చేసిన నిషేధిత ఉత్తర్వులను తాజాగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని శ్రీరామ్ చెప్పారు. ఈ నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ హై కోర్టు సైతం సమర్థించిందన్నారు. గత 99 ఏళ్లుగా దేశ సేవలో నిమగ్నమైన ఆర్.ఎస్.ఎస్. పై వామపక్ష పార్టీలు వీలు చిక్కినప్పుడల్లా విషం చిమ్ముతున్నాయని శ్రీరామ్ ఆగ్రహించారు. దేశ వ్యాప్తంగా ప్రాభవం కోల్పోతూ వస్తున్న వామపక్షాలు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఆర్.ఎస్.ఎస్. పై బురద జల్లడం వారికి పరిపాటిగా మారిందన్నారు. ఇకపై తమ పై నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆర్.ఎస్.ఎస్. దక్షిణ భారత ప్రచార ప్రముఖ్ స్పష్టం చేశారు.