News

దేవాలయ కమిటీల్లోకి చొరబడండి… కేడర్ కి సూచించిన కమ్యూనిస్టు నేతలు

45views

గతి తార్కిక భౌతికవాదం, భౌతికవాదం, మత మౌఢ్యం అంటూ రోజూ నాస్తికత్వాన్ని వల్లించే కమ్యూనిస్టు పార్టీలు మరో కొత్త డ్రామాకి తెరలేపారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా ముఖ్యంగా కేరళలో ఘోరమైన పరాభవం తర్వాత… సీపీఎం పార్టీ కొత్త నిర్ణయం తీసుకుంది. దేవాలయ కమిటీలపై కన్నేసింది. ఎలాగైనా దేవాలయ కమిటీల్లో సీపీఎం నేతలందరూ కమిటీ సభ్యులుగా చేరాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఈ దేవాలయ కమిటీలపై పూర్తి పట్టు సాధించాలని కింది స్థాయి కేడర్‌కి గట్టి సూచనలు అందాయి. తిరువనంతపురం కేంద్రంగా మూడు రోజుల పాటు సీపీఎం సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లోనే దేవాలయ కమిటీల్లోకి కమ్యూనిస్టు నేతలు వెళ్లాలని సూచనలు వచ్చాయి.

నిజానికి 2013 లో పాలక్కాడ్‌ కేంద్రంగా సీపీఎం ప్లీనం సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో కామ్రేడ్‌లెవ్వరు కూడా దేవాలయాలను సందర్శించవద్దని, మతపరమైన, ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని, సంప్రదాయాలను పాటించవద్దంటూ సీపీఎం మార్క్సిస్టు పార్టీ ఏకంగా తీర్మానాలు చేసింది. అంతేకాకుండా సీపీఎం సభ్యులెవ్వరూ ఆలయ కమిటీల్లో కూడా చేరవద్దని తీర్మానాలు చేశారు. గృహ ప్రవేశాల్లాంటి కార్యక్రమాల్లో గణపతి హోమం లాంటి ఆచారాలను కూడా నిర్వహించవద్దని కూడా సూచించారు.

ఇంతటి దుర్మార్గపు నిర్ణయాలు తీసుకున్న కమ్యూనిస్టు పార్టీ సీపీఎం మార్క్సిస్టు ఇప్పుడు రివర్స్‌ అయ్యింది. సీపీఎం సభ్యులందరూ దేవాలయ కమిటీల్లోకి చొరబడాలని, ఆ కమిటీల్లో సభ్యులుగా చేరాలని చెప్పడం చూస్తుంటే చాలా విడ్డూరంగా వుంది. లోక్‌సభలో ఘోర పరాభవం వచ్చిన తర్వాతే.. కమ్యూనిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కమ్యూనిస్టులకు కంచుకోట అయిన మలబార్‌లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఓట్లు గణనీయంగా తగ్గి, బీజేపీకి విపరీతంగా పెరిగాయి. దీంతో కమ్యూనిస్టులు దేవాలయాలపై గుత్తాధిపత్యం పెంచుకోవాలని చూస్తున్నారు. హిందూ విశ్వాసాలను గౌరవించడానికి ఈ నిర్ణయం తీసుకుంటే మంచిది గానీ.. రాజకీయ ప్రాబల్యం కోసం దేవాలయ కమిటీల్లోకి చొరబడడాన్ని హిందువులు క్షమించరు.