News

‘నిరాకారంతో అనుసంధానమే విగ్రహారాధన’

44views

తప్పటడుగులతో స్తంభించిన ప్రపంచానికి భారతీయ సంప్రదాయాల నుంచి జ్ఞానం అవసరమని, భారతీయులకే సొంతమైన జ్ఞానం, భక్తి, క్రియ అనే త్రిగుణాల సంగమం ద్వారా ప్రపంచానికి మార్గం చూపగలమని ప.పూ.సర్ సంఘ్‌చాలక్ డా. మోహన్ భాగవత్ గారు స్పష్టం చేశారు. ప్రముఖ విద్యావేత్త, పురావస్తు శాస్త్రవేత్త డా. జి.బి.డెగ్లూర్కర్ రచించిన ‘అథాతో బింబ జిద్న్యాస’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతీయులు విగ్రహారాధకులు అని, ఈ విగ్రహాలు ఆకారాన్ని దాటి నిరాకారంతో అనుసంధానించేందుకు మార్గాలని వివరించారు.

ప్రతి భారతీయ విగ్రహం వెనుక సైన్స్ దాగుందని, అవి భావోద్వేగాలను రేకెత్తిస్తాయని సర్ సంఘ్‌చాలక్ అన్నారు. అయితే ఆ భావోద్వేగాలను అనుభవించేందుకు దృష్టి మరియు విశ్వాసం అవసరం అన్నారు. డెగ్లూర్కర్ రాసిన పుస్తకం భారతీయ జీవితాన్ని, విజ్ఞాన సంప్రదాయాన్ని దర్శించుకునేందుకు సానుకూల దృక్పథాన్ని ఇవ్వడంతో పాటు మనస్సాక్షిని మేల్కొలుతుందని స్పష్టం చేశారు.

ప్రతిష్టంభన దశలో ఉండి పరిష్కారం కోసం తన వైపు చూస్తున్న ప్రపంచానికి భారత్ మార్గం చూపగలదన్నారు. అయితే ఆ మార్గాన్ని తొలుత మనం తెలుసుకోవాలన్నారు. భక్తి, కర్మ, జ్ఞానం ద్వారా దీనిని సాధించగలమని మోహన్ భాగవత్ గారు తెలిపారు. డెగ్లూర్కర్ పుస్తకం ద్వారా భక్తి, కర్మ, జ్ఞానం అనే త్రిగుణాల సంగమంతో ప్రపంచానికి శాంతితో పాటు మన దేశాన్ని ఉద్ధరించుకోవడమే కాక స్వీయ మోక్షాన్ని కూడా పొందగలమన్నారు.

అనంతరం, ఛాయాచిత్రాల ద్వారా శిల్పకళ యొక్క ప్రాముఖ్యతను డా.డెగ్లూర్కర్ తెలియజేశారు. విగ్రహాలు మరియు రేఖా చిత్రాలు మన సనాతన ధర్మ చిహ్నాలని ఆయన అన్నారు. విగ్రహాలపై శాస్త్రీయ అధ్యయనం మరియు అవగాహన లేకుండా హిందూ ధర్మాన్ని అవగతం చేసుకోవడం సాధ్యం కాదన్నారు. కనుక, విగ్రహాలను అర్థం చేసుకుంటనే హిందూ ధర్మం యొక్క అర్థం తెలుస్తుందన్నారు.