News

వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

41views

లోక కల్యాణార్థం, భక్తజన శ్రేయస్సు, ధర్మప్రచారం నిమిత్తం ప్రతి పౌర్ణమి రోజు నిర్వహించే గిరి ప్రదక్షిణలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారని దుర్గగుడి ఈవో కేఎస్‌ రామరావు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఆదివారం ఉదయం 5.55 గంటలకు ఘాట్‌ రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. అక్కడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ప్రచార రథానికి ఈవో రామరావు దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. అమ్మవారి ఆలయం నుంచి మొదలైన ప్రదక్షిణ కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్‌, సితారా, కబేళా, పాలప్రాజెక్ట్‌, కేఎల్‌రావునగర్‌, చిట్టినగర్‌, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్‌, బ్రాహ్మణ వీధి, ఘాట్‌రోడ్డు మీదగా తిరిగి ఆలయానికి చేరుకుంది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, డప్పు కళాకారులు, కోలాట నృత్యాల మధ్య భక్తజనం ముందుకుసాగారు. పౌర్ణమి రోజున జరిగే గిరి ప్రదక్షిణలో పాల్గొంటే కోరికలు త్వరగా తీరుతాయని నమ్మకమని, అందుకే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆలయ అధికారులు తెలిపారు.