News

దర్శనం కష్టాలు

72views

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి భక్తులు ప్రత్యక్ష నరకాన్ని చూశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి చుక్కలు కనిపించాయి. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు క్యూలైన్‌లోకి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి నాలుగు గంటలకుపైగా సమయం పట్టింది. ఇంద్రకీలాద్రిపై ఏది ప్రవేశ మార్గమో, ఏది బయటకు వెళ్లే మార్గమో తెలియలేదు. దేవస్థాన అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, సెక్యూరిటీ సిబ్బంది చేతులెత్తేయడంతో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇక్కట్లు తప్పలేదు. చివరికి సహనం నశించిపోయిన భక్తులు అధికారులపై ధ్వజమెత్తారు. అక్కడే ఉన్న సిబ్బందిని నిలదీశారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇంద్రకీలాద్రిపై మూడు ఘట్టాలు ఒకేసారి వచ్చాయి. ఆదివారం గురుపౌర్ణమి. ఈనెల 19వ తేదీ నుంచి ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను పూర్ణాహుతితో ముగించారు. ఈ రెండు కాకుండా కొద్దిరోజులుగా అమ్మవారికి మహిళలు భారీగా సంఖ్యలో ఆషాఢమాస సారె సమర్పిస్తున్నారు. వాళ్లంతా భక్త బృందాలుగా ఏర్పడికి ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. గురుపౌర్ణమి, శాకాంబరీ ఉత్సవాల ముగింపు, సారె సమర్పణలు ఒకేసారి జరగడంతో భక్తులు లెక్కకు మించి వచ్చారు. ఈ మూడు అంశాలను అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.

రాకపోకలకు భక్తుల అవస్థలు
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగి పడతాయన్న కారణంగా ఘాట్‌రోడ్డును అధికారులు పూర్తిగా మూసివేశారు. అధికారుల వాహనాలను, ఆలయ సిబ్బంది ద్విచక్ర వాహనాలను మాత్రమే పైకి అనుమతిస్తున్నారు. కాలినడకన వచ్చే భక్తులను నిలుపుదల చేశారు. దుర్గాఘాట్‌ వద్ద నుంచి దేవస్థాన బస్సుల్లో భక్తులను కొండపైకి తీసుకొస్తున్నారు. మరోపక్క కనకదుర్గ నగర్‌లో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. దీంతో కనకదుర్గ నగర్‌ ఇరుకుగా మారింది. ఘాట్‌ రోడ్డును మూసివేయడంతో భక్తులకు కనకదుర్గ నగర్‌ మార్గంలోనే రాకపోకలు సాగించాల్సి వచ్చింది. ఈ మార్గంలో ఉన్న మహామండపం వద్ద లిఫ్ట్‌లు ఉన్నాయి. ఇక్కడి నుంచి వృద్ధులు, రూ.500 టికెట్‌ భక్తులను అనుమతిస్తామని బోర్డులు పెట్టారు. ఉచిత దర్శనం, రూ.100, రూ.300 దర్శనం భక్తులు క్యూలైన్ల నుంచి వెళ్లాలని మరో బోర్డు పెట్టారు.

క్యూలైన్లు కిటకిట
దర్శనానికి వచ్చే భక్తులు, సారె సమర్పించడానికి వచ్చిన భక్తులు క్యూలైన్లు నిండిపోవడంతో లిఫ్టుల వైపు వచ్చారు. దర్శనం పూర్తయిన భక్తులను తిరిగి లిఫ్టుల్లో తీసుకొచ్చి కింద వదిలారు. కొంతమంది భక్తులు మహామండపం మెట్లమార్గం నుంచి కిందికి దిగారు. ఈ భక్తులు బయటకు వెళ్లడానికి బారికేడ్లతో ఒక తాత్కాలిక క్యూను ఏర్పాటు చేశారు. దీనికి వ్యతిరేక మార్గంలో భక్తులు పైకి వెళ్లారు. లిఫ్టుల వద్ద, క్యూల్లో భక్తులు ఎక్కువగా ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త బృందాలు మెట్ల మార్గం నుంచి పైకి వెళ్లాయి. కిందికి దిగే భక్తులు, ఎక్కే భక్తులు ఈ మెట్ల నుంచి రావడంతో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి కనిపించింది. పాత మెట్ల నుంచి పూజ చేసుకుంటూ పైకి సారెతో వచ్చిన భక్తులు అక్కడున్న ఈవో కార్యాలయం వద్ద గూమిగూడిపోయారు. ఈ మార్గం మొత్తం ఆగిపోవడంతో పోలీసులు వారిని వెనక్కి తీసుకొచ్చి క్యూల్లోకి పంపాల్సి వచ్చింది. దర్శనం అయిన తర్వాత బయటకు వెళ్లాల్సిన భక్తులు గుడికి కుడివైపున ఉన్న మార్గం నుంచి బయట వెళ్లడానికి ప్రయత్నించారు. ఇక్కడ నుంచే వీఐపీ పేరుతో భక్తులు దర్శనానికి రావడం మొదలుపెట్టారు. ఇక్కడ గేటుకు సెక్యూరిటీ తాళాలు వేయడంతో భక్తులు నిలిచిపోయారు.

అంచనాలో అధికారుల విఫలం
తాము గంటల తరబడి నిలబడితే వీఐపీ ముసుగులో ఎంతమందికి దర్శనాలు చేయిస్తారని క్యూల్లో ఉన్న భక్తులు ప్రశ్నించారు. దీంతో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది వెళ్లిపోయారు. ఆలయానికి ఎదురుగా ఉన్న రాజగోపురం వద్ద భక్తులు భారీగా నిలిచిపోయారు. పోలీసులు, సెక్యూరిటీ నిలుపుదల చేసినా బారికేడ్లను దాటుకుని లోపలకు వెళ్లారు. అమ్మవారికి 12 గంటలకు ఇచ్చే నివేదన కారణంగా కొంతసేపు దర్శనాన్ని నిలుపుదల చేశారు. దీంతో భక్తుల సంఖ్య మరింతగా పెరిగిపోయింది. పరిస్థితిని అంచనా వేయడంలో అధికారులు విఫలమవ్వడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని భక్తులు విమర్శిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది విజిల్స్‌ చేయడం తప్ప భక్తులను క్రమపద్ధతిలో దర్శనానికి పంపలేదని ఆరోపించారు