ArticlesNews

స్వదేశంమీద లేని ప్రేమ పాలస్తీనాపై : ఐఐటీ మద్రాస్ పట్టభద్రుడి నిర్వాకం

131views

శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్ కాన్వొకేషన్ కార్యక్రమంలో ఒక విద్యార్ధి పాలస్తీనా అనుకూల ప్రసంగం చేయడం వివాదాస్పదమైంది. మెకానికల్ ఇంజనీరింగ్‌ డ్యూయెల్ డిగ్రీలో విద్యా, విద్యేతర విషయాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు బహుమతి గెలుచుకున్న ధనంజయ్ బాలకృష్ణన్ అనే విద్యార్ధి ఆ ప్రసంగం చేసాడు.

ఐఐటీలో ఆల్‌రౌండ్ ప్రొఫిషియెన్సీ ప్రైజ్ సాధించిన ధనంజయ్, రాష్ట్ర గవర్నర్ నుంచి ఆ పురస్కారం తీసుకున్నాక తన ప్రసంగంలో పాలస్తీనా గురించి మాట్లాడాడు. అక్కడ సామూహిక జనహననం జరుగుతోందనీ, దానికి వ్యతిరేకంగా కార్యాచరణలోకి దిగాలనీ ప్రసంగించాడు.

ధనంజయ్ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘‘నాకు లభించిన ఈ అవకాశాన్ని, ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పడానికి వినియోగించుకోకపోతే నాకు, నా విశ్వాసాలకు నేనే అన్యాయం చేసుకున్న వాడిని అవుతాను. ఈ విషయంపై కార్యాచరణ కోసం పిలుపునిస్తున్నాను. పాలస్తీనాలో సామూహిక జనహననం జరుగుతోంది. ప్రజలు పెద్దసంఖ్యలో చనిపోతున్నారు. కనుచూపు మేరలో దానికి ముగింపు కనిపించడం లేదు. ఇక్కడున్న విద్యార్ధులు దానిగురించి ఆందోళన చెందాలి. ఎందుకంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం అనే నాలుగూ కలిసి (STEM) సామ్రాజ్యవాదపు దురుద్దేశాలకు సాయపడుతున్నాయి. దానికి ఉదాహరణ ఇజ్రాయెల్.’’

కష్టపడి పనిచేసే ఇంజనీరింగ్ విద్యార్ధులకు గొప్పగొప్ప టెక్నాలజీ కంపెనీలు ఆకర్షణీయమైన అవకాశాలు కల్పిస్తాయి, కానీ పాలస్తీనాపై యుద్ధంలో ఆ కంపెనీలు తమవంతు పాత్ర పోషిస్తున్నాయని ధనంజయ్ వ్యాఖ్యానించాడు. ‘‘మన జీవితాలను ఈ టెక్ జెయింట్స్ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు. ఆ విషయం అందరి కంటె ఎక్కువ మనకే బాగా తెలుసు. అయితే ఈ ప్రఖ్యాత కంపెనీలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పాలస్తీనాపై యుద్ధానికి కారణమవుతున్నాయి. అవి ఇజ్రాయెల్‌కు టెక్నాలజీని అందజేస్తున్నాయి’’ అని చెప్పుకొచ్చాడు.

సమాజంలోని అన్ని ప్రశ్నలకూ తన దగ్గర జవాబులు లేవనీ, కానీ ఇంజనీర్లుగా వాస్తవిక ప్రపంచంలోకి అడుగుపెట్టే విద్యార్ధులు తమ పని తాలూకు ఫలితాల గురించి తెలుసుకోవాలనీ ధనంజయ్ వ్యాఖ్యానించాడు.

ధనంజయ్ తన ప్రసంగాన్ని ఇలా ముగించాడు ‘‘తాను వెళ్ళాలన్న చోటికి తనను తీసుకువెళ్ళగల గొప్పవారి భుజాల మీద నిలబడ్డానని ఐజాక్ న్యూటన్ చెప్పాడు. మనందరం ఇక్కడ, ఎంతో ఘనత కలిగిన భారతీయుల విశాలమైన భుజాల మీద నిలబడి ఉన్నాం. వారికి మనం ఋణపడి ఉన్నాం, ప్రతీ ఒక్క వ్యక్తినీ వారివారి బాధల నుంచి బైటకు లాగడం ద్వారానే వారి ఋణం తీర్చుకోగలం. ఏమీ చేయకుండా ఉండిపోవడం, నేరంలో పాలు పంచుకోవడమే. మీరూ, నేనూ, మనమంతా సరైన నిర్ణయాలు తీసుకుంటామని – అవి ఎంత కష్టమైనవైనా – వాటికి కట్టుబడి ఉంటామనీ ఆశిస్తున్నాను.’’

విచిత్రమేమంటే జమ్మూకశ్మీర్‌లో పాకిస్తానీ ఉగ్రవాదుల అరాచకాల గురించి, బెంగాల్‌లో హిందువులను లక్ష్యం చేసుకుని చంపేసేవారి గురించి, రకరకాల పద్ధతుల్లో మనదేశంపై జిహాద్ ప్రకటించి అమలుపరిచేవారి గురించి, వారికి అండగా నిలిచే లాల్-నీల్-హరా హరామ్‌ఖోర్‌ల గురించి, తమ మతంలోకి మారకపోతే చంపేసే దుర్మార్గుల గురించి, చాప కింద నీరులా దేశీయ సంస్కృతీ సంప్రదాయాలను నాశనం చేసే నికృష్టుల గురించి, భారతీయులకు మాతృభూమి పట్ల అభిమానం లేకుండా చేసే కుట్రల గురించి, దేశంలోకి అక్రమంగా చొరబడిపోయి ఇక్కడి ప్రజలను అంతం చేసే కర్కోటకుల గురించి, దేశ జనాభా సంతులనాన్ని దెబ్బతీసే కుతంత్రాల గురించి, విదేశాల్లో సైతం విద్వేష ప్రచారం చేసే నికృష్టుల గురించి ఒక్కముక్క ఆలోచించని ఇలాంటి మేధావులు ఇజ్రాయెల్, పాలస్తీనా వ్యవహారాల గురించి మనదేశంలో మాట్లాడతారు. అక్కడివారి గురించి ఆవేదనాపూరితంగా ప్రసంగాలు చేస్తారు. యూదుల అస్తిత్వ పోరాటం గురించి సానుభూతి లేని ఈ చదువుకున్న మూర్ఖులు, పాలస్తీనా ముస్లిం హమాస్ ఉగ్రవాదుల దుశ్చర్యల విషయంలో ప్రమాదకరమైన మౌనం పాటిస్తారు. ప్రజాస్వామ్యం పేరిట మన దేశంలో లభిస్తున్న స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భారతీయ ప్రజల సొమ్ములతో చదువుకుని ఈ దేశానికి పావలా వంతయినా ఉపయోగపడతారో లేదో తెలీని ఈ మేధావులు ప్రపంచానికి సందేశాలు మాత్రం ఇస్తున్నారు.

విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనా అనుకూల నినాదాలు, ప్రసంగాలు చేయడం ఇదే మొదటిసారి కాదు.

యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్‌లో పాలస్తీనా అనుకూల ఆందోళనలు చేపట్టిన విద్యార్ధులపై నిన్ననే క్రమశిక్షణా చర్యలు మొదలుపెట్టారు. 21మంది విద్యార్ధులపై సస్పెన్షన్ లేదా తొలగింపు వేటు వేసే అవకాశం ఉంది.

యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్‌లో డానా అల్‌షేర్ అనే విద్యార్ధి సమూహం పాలస్తీనా అనుకూల ఆందోళనలు నిర్వహిస్తోంది. గత నవంబర్‌లో ఏర్పడిన ఆ సంస్థలో వర్సిటీ విద్యార్ధులు, పూర్వవిద్యార్ధులు, కొందరు ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇజ్రాయెలీ సంస్థలతోనూ, ఆయుధాల ఉత్పత్తిదారులతోనూ విశ్వవిద్యాలయం అన్ని సంబంధాలూ తెంచుకోవాలన్నది వారి డిమాండ్.

24 మే నాడు అశోకా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్‌లో కూడా ఆ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్లకార్డులతో ప్రదర్శనలు చేసారు. ఇజ్రాయెల్‌కు చెందిన టెల్ అవీవ్ యూనివర్సిటీతో అశోకా విశ్వవిద్యాలయం అన్ని సంబంధాలనూ తెంచేసుకోవాలని డిమాండ్ చేసారు. ఆ రెండు విశ్వవిద్యాలయాల మధ్యా పరిశోధనా భాగస్వామ్యం ఉంది. అటువంటి రాజకీయ నిర్ణయాలతో తమకు సంబంధం లేదంటూ, విద్యార్ధుల డిమాండ్లను అశోకా వర్సిటీ త్రోసిపుచ్చింది.

ఈ యేడాది ఏప్రిల్‌లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్ధులు కొన్నివారాల పాటు ఆందోళనలు నిర్వహించారు. దాంతో వర్సిటీ యాజమాన్యం 13మంది విద్యార్ధులకు పట్టాలు నిలిపివేసింది. అమెరికాలోని మరికొన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా పాలస్తీనా అనుకూల ఆందోళనలు కొన్నివారాల పాటు సాగాయి