ArticlesNews

గురుపూజ అంటే సమర్పణే !

60views

( జూలై 21 – గురుపూర్ణిమ )

భారతీయ జీవన విధానంలో విద్యార్జనకు చాలా పవిత్రత ఉంది. విద్యనేర్పే గురువు తనకున్న జ్ఞానాన్నంతా ధారపోస్తే తప్ప, శిష్యుడికి విద్య లభించేది కాదు. బాల్యావస్థలో ఉన్న శిష్యుడు ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి వెచ్చించాల్సినవి మూడు అంశాలు. 1. శరీరం 2. సమయం 3. ధనం. ఈ మూడింటిలో శిష్యుడి ఆధీనంలో ఉండేవి శరీరం, సమయం మాత్రమే. అతడికి ధనాన్ని మాత్రం తల్లిదండ్రులో, సమాజమో ఇవ్వాల్సిందే! శరీరం, సమయం, ధనాలను వెచ్చించినా అనాటికి లభించేది శిష్యత్వం మాత్రమే. అప్పటికి లభించిన శిష్యత్వంతో గురువును ఒప్పించడమూ, మెప్పించడమూ జరిగితేనే గురువు నుండి విద్య లభించేది. శిష్యుడికి ఎపుడూ విద్య అనేది దానంగానే లభించేది. ఈనాటిలాగా అది హక్కుకాదు. తనకు లభించినదాన్నే శిష్యుడు మహాప్రసాదమని కళ్ళకద్దుకుని స్వీకరించేవాడు.

ప్రాచీన వేదకాలంలో మనదేశంలో విద్యనందించడానికి గురువు తన శిష్యుడి నుండి ప్రతిఫలం ఆశించడం జరిగేదికాదు. అది పొందడానికి అతడికి అర్హత ఉందా లేదా అని మాత్రమే పరిగణనలోకి తీసుకోబడేది. శిష్యుడిలోని పట్టుదల, నేర్చుకోవాలనే తత్త్వం గమనించాకే గురువు విద్యను ప్రసాదించేవాడు. తను నేర్చుకున్న విద్యను ప్రదర్శించి, గురువును సంతృప్త పరిస్తేనే శిష్యుడి విద్యాభ్యాసం పూర్తయినట్లు. ఆనాటినుండే శిష్యుడనే వాడు సమాజంలోకి వెళ్ళి, సాంఘిక జీవనం గడపడానికి తగిన హంగులు ఏర్పరచుకుని ముందుకు సాగిపోయేవాడు.

గురుశుశ్రూష ద్వారా విద్యలు నేర్చుకున్న శిష్యుడు గురువు నుండి సెలవు తీసుకుని వెళ్ళేటపుడు, గురువుకు అతడి శక్త్యానుసారం తృణమో, పణమో ఇవ్వడమనేది ఆచారమైంది. అదికూడా భవిష్యత్తు విద్యార్థుల కొరకే ఉపయోగపడేది. గురువులు నోరు తెరిచి అడగకపోయినా శిష్యులే తమకు నచ్చినది ఇచ్చివెళ్ళేవారు. మన భారతీయ సమాజంలో, గురువు ఏమీ వద్దు అనిచెప్పినా, సతాయించి మరీ గురుదక్షిణ ఏం కావాలో చెప్పాల్సిందేనని పట్టుబట్టిన శిష్యులు కనబడతారే తప్ప, నాకు ఇది ఇచ్చాకే వెళ్ళు అన్న గురువులు కనబడరు. గురుదక్షిణ స్వీకరించాల్సిందేనని పట్టుబట్టిన శిష్యుల శక్తి సామర్థ్యాలను పరీక్షించడానికి ఇంత గురుదక్షిణ కావాలని పరీక్ష పెట్టిన గురువులూ మనకు కనబడతారు. తమకు శిష్యుల ద్వారా లభించిన గురుదక్షిణను, శిష్యుల చేతికే అప్పగించి సమాజకార్యం కోసం వినియోగించమని అడిగిన గురువులూ మన కళ్ళముందు సాక్షాత్కరిస్తారు.

ప్రాచీన భారతీయ పరంపర నుండే ఒక్కో నూలుపోగును ఎంచుకుని నూతన సమాజమనే వస్త్రాన్ని నేయబూనుకున్న ఆర్.ఎస్.ఎస్. సంస్థాపకులు డా॥ హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో అనేక ఆదర్శాలతోబాటు ‘గురువు’నూ ఎంపిక చేశారు. అయితే ఆ గురువుగా మానవమాత్రుడు కాకుండా దేశ పరంపరకు సంకేతమైన భగవాధ్వజాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆ కాషాయధ్వజ చ్ఛాయల్లో సంఘ స్వయంసేవకులు సంస్కారాలు పొంది, సమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు. తమ ముందు స్ఫూర్తి ప్రతీకగా నిలబడిన కాషాయధ్వజాన్నే గురువుగా స్వీకరించి గురుపూజ చేయడం జరుగుతుంది. ఆ గురువుకు పూజ చేయడమేగాక, దానికి గురుదక్షిణ చేయడమూ స్వయంసేవకులకు నేర్పారు డా. హెడ్గేవార్.

సంఘలో గురుపూజ చేయడమంటే అది సమర్పణే. ఆ సమర్పణ అనేది మూడు రకాలు. మొదటిది జీవన సమర్పణ, రెండవది సమయ సమర్పణ, మూడవది ధన సమర్పణ. సంఘకార్యం చేయడానికి జీవనం, సమయం సమర్పణతో బాటు ధనమూ సమర్పణ చేయాల్సిందే. అపుడే సంఘకార్యం మరింత వేగంగా జరగడానికి సాధ్యమవుతుంది అనే భావన కల్గించడమే సంఘలో గురుపూజ చేసి, గురువు ముందు స్వయంగా నిల్చుని గురుదక్షిణ ఇవ్వడంలోని ఉద్దేశం. పూజ అంటే పుష్పాలతో చేసేది, దక్షిణ అంటే డబ్బుతో చేయాల్సిన విషయమని స్పష్టమవుతుంది. గురువుకు పూజ చేయడంతోబాటు గురువును ఆర్ధికంగా బలోపేతం చేసినపుడే సమాజం అన్నిరంగాలలో ముందుకెళ్ళడానికి ఆస్కారముంటుంది. అందుకే గురువుకు పూజతో బాటు గురుదక్షిణ ఇవ్వడమన్నది మనదేశంలో ఆచారంగా వచ్చింది.

వ్యక్తిని సంస్కరించడంతోబాటు, ఆ వ్యక్తిని తన సమాజం కోసం ఏదైనా చేయడానికి ప్రేరణనిచ్చేలా తయారు చేసిన సంఘ అదే ఆదర్శాన్ని స్వీకరించి, సంఘలో గురువును, గురుపూజను, గురుదక్షిణను ప్రవేశపెట్టింది. స్వయంసేవకులకు సమర్పణను అలవాటుచేసింది. సంఘలో గురుపూజ చేయడమంటే తనను తాను సమర్పించుకోవడమే. సమర్పించుకోవడమన్న దానికి హద్దులేమీ లేవు. హద్దులులేని సమర్పణ భావమే గురువుకు చేసే గురుపూజగా సంఘ భావించి గురుపూర్ణిమ రోజున కార్యక్రమం నిర్వహిస్తుంది. భగవాధ్వజమనే ప్రతీకను గురుస్థానంలో నిలుపుకుని, రోజువారీగా పొందిన సంస్కారాలకు గాను మనమందరమూ ఆ గురువుకు పూజచేద్దాం, గురుదక్షిణ సమర్పణ చేద్దాం.