News

జూలై 21న శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి చాతుర్మాస్య దీక్ష…

37views

తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి నేతృత్వంలో చాతుర్మాస్య దీక్ష సంకల్పాన్ని జూలై 21న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సనాతన వైదిక ధర్మంలో చాతుర్మాస్య దీక్షలకు ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదాలను లోక కళ్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీ రామానుజాచార్యుల వారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మరుసటి రోజు నుంచి ఈ చాతుర్మాస్య దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషంగా భావిస్తారు. తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా పెద్దజీయరు స్వామి శిష్య బృందంతో కూడి ముందుగా వరాహస్వామి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించి అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత రంగనాయకుల మండపంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని, శ్రీ‌శ్రీ‌శ్రీ‌ చిన్నజీయంగారికి నూలుచాటు వస్త్రాన్ని బహూకరిస్తారు.

గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 21న గరుడసేవ జరుగనుంది.రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.